India vs Pakistan, Asia Cup 2023: ఆసియా కప్ లో భాగంగా మంగళవారం ఇండియా vs పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చేజింగ్ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారత బౌలర్ రవింద్ర జడేజా బౌలింగ్ చేస్తుండగా పాక్ బ్యాట్స్‌మన్ సల్మాన్ అలీ అఘా స్ట్రైకింగ్ లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. జడేజా బౌలింగ్ లో అఘా సల్మాన్ బంతిని హిట్ ఇవ్వబోగా.. ఆ బంతి షాట్ మిస్ అయి వచ్చి అతడి ముఖానికి బలంగా తగిలింది. ఊహించని పరిణామానికి పాక్ బ్యాట్స్ మన్ సల్మాన్ అలీ అఘాకి ఒక్క క్షణం కళ్లు బైర్లు కమ్మాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంతి వేగంగా వచ్చి తగలడంతో ఆ దెబ్బ ధాటికి సల్మాన్ అలీ అఘా ఒక్కసారిగా షాకయ్యాడు. అదే సమయంలో కీపింగ్ లో ఉన్న కేఎల్ రాహుల్ సైతం మెరుపు వేగంతో స్పందించాడు. పాకిస్థాన్ తమకు చిరకాల ప్రత్యర్థి జట్టే అయినప్పటికీ.. ఆ క్షణంలో కేఎల్ రాహుల్ అదేమీ ఆలోచించకుండా స్పోర్టివ్ స్పిరిట్ తో హుటాహుటిన సల్మాన్ అలీ అఘా వద్దకు పరుగెత్తుకొచ్చి అతడి పరిస్థితి ఏంటని ఆరా తీస్తూ అతడికి సహాయ పడేందుకు ప్రయత్నించాడు. అప్పటికే బంతి తగిలిన వేగానికి అక్కడ చర్మం కోసుకుపోవడంతో ముఖంపై రక్తం బయటికొచ్చింది. ఈ దృశ్యాలన్నీ లైవ్ కెమెరాల్లో రికార్డయ్యాయి.


జరిగిన ఘటనను గమనించిన పాకిస్తాన్ టీమ్ ఫిజియో వెంటనే బ్యాట్స్‌మన్ సల్మాన్ అలీ వద్దకు పరిగెత్తుకొచ్చి అతడికి అవసరమైన ప్రథమ చికిత్స అందించాడు. అనంతరం స్ట్రైకింగ్ షురూ చేసిన సల్మాన్ అలీ అఘా.. ఈ మ్యాచ్ లో 32 బంతులు ఫేస్ చేసి 23 పరుగులు రాబట్టి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్లూ అయి పెవిలియన్ బాటపట్టాడు. అప్పటికి పాకిస్థాన్ జట్టు మొత్తం స్కోర్ 96 పరుగులకు 5 వికెట్లు నష్టపోయింది.