వియత్నాంకు చెందిన ఓ చేపల వ్యాపారి తన పెంపుడు పిల్లితో చేపలు అమ్మించే ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. ఆ ఐడియా రాగానే తన పిల్లికి మంచి మంచి రంగుల చొక్కాలు కుట్టించి.. టోపీతో పాటు కళ్లద్దాలు కూడా పెట్టి.. క్యాష్ కౌంటర్ వద్ద తన స్థానంలో దానిని కూర్చోబెట్టాడు. ఇంకేముంది.. ఆ ముచ్చటైన క్యాషియర్ పిల్లిని చూడడానికి జనాలు విరగబడ్డారు. అంతే.. ఆ పిల్లి యజమాని వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నచందంగా తయారైంది. విపరీతమైన లాభాలు కూడా వచ్చాయి, చిత్రమేంటంటే.. ఆ పిల్లికి దాని యజమాని పెట్టిన పేరు కూడా విచిత్రంగా ఉంది. దానిని ముద్దుగా "డాగ్" అని పిలుచుకుంటారు ఆయన. ప్రస్తుతం ఆ పిల్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేయడం ప్రారంభించాయి.