Rs 2000 Notes Piggy Bank Viral Videos:  2,000 రూపాయల నోట్లను సెప్టెంబర్ 30 నుంచి చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన ఎన్నో చర్చలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అలాగే,  రూ. 2000 నోట్లకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే వీడియా కూడా అలా నెటిజెన్స్ దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది. కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బుల్లో ఉన్న రూ. 2 వేల రూపాయలను బ్యాంకులో మార్చుకోవాలనే ఆలోచనతో ఇద్దరు చిన్నారులు తమ తల్లిదండ్రుల సమక్షంలోనే తమ పిగ్గీ బ్యాంకును పగలగొట్టిన వీడియో ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీ చిన్నప్పుడు మీ పేరెంట్స్ ఇచ్చిన పాక్ మనీని పిగ్గీ బ్యాంకులో పదిలంగా దాచుకోవడం మీకు కూడా గుర్తుండే ఉంటుంది. ఏవైనా అవసరాలు ఉన్నప్పుడు కానీ లేదా ఆ పిగ్గీ బ్యాంక్ నిండినప్పుడు కానీ దానిని పగలగొట్టి అందులో దాచుకున్న డబ్బులను లెక్కించడంలో ఉన్న ఆనందం ఎలా ఉంటుందో గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా.. చిన్న వయస్సులోనే డబ్బులను వృధా చేయకుండా పొదుపు చేసుకునే అలవాటు కూడా నేర్చుకున్నాం అనే సంతృప్తి కించిత్ గర్వాన్ని కూడా ఇస్తుంది కదూ.. ఇదిగో ఇక్కడ ఈ ఇద్దరు చిన్న పిల్లల ముఖాల్లో కూడా అలాంటి ఆనందమే స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే అప్పట్లో డబ్బులు దాచుకోవడం అంటే రూపాయి.. రూపాయి పోగేసుకోవడం.. లేదా మహా అయితే రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100 లాంటి నోట్లనే దాచుకునే వారు. 


కానీ ఇప్పుడు పేరెంట్స్ ఆదాయా మార్గాలు పెరిగాయి. అలాగే సంపాదన కూడా అదే స్థాయిలో పెరిగింది. దీంతో తమ పిల్లలకు పెద్ద మొత్తంలో పాకెట్ మనీ ఇచ్చే వాళ్లు కూడా ఉంటున్నారు. ఇదిగో ఇక్కడ ఈ చిన్నారుల విషయంలో కూడా అలాంటిదే జరిగింది అనిపిస్తోంది.. ఎందుకంటే.. వీళ్ల పిగ్గీ బ్యాంకు నిండా మొత్తం రూ. 500 నోట్లే దర్శనం ఇస్తున్నాయి.. అక్కడక్కడ రూ. 2 వేలు నోట్లు కూడా కనిపిస్తున్నాయి. 


పిగ్గీ బ్యాంకులోంచి అంత పెద్ద మొత్తంలో నోట్లు బయటపడటం చూసి నెటిజెన్స్ నోరు వెళ్లబెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోకు 36 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు.. 1.5 మిలియన్ మంది ఈ వీడియోను లైక్ చేశారు. 


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజెన్స్ తమదైన స్టైల్లో ఫన్నీగా కామెంట్స్ రాస్తున్నారు. ఈ చిన్నారుల పిగ్గీ బ్యాంకులో ఉన్నంత డబ్బు కూడా నా ఖాతాలో లేదు అని కొంతమంది కామెంట్ చేస్తే.. అందులో సగం కూడా నా బ్యాంకు ఖాతాలో లేవు అని ఇంకొంతమంది కామెంట్ చేశారు. మరికొంతమంది స్పందిస్తూ.. నా పిగ్గీ బ్యాంకులో ఏనాడూ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చూసిన దాఖలాలు లేవని రాస్తున్నారు. ఇదిలావుంటే, ఈ వీడియో చూసిన వారిలో కొంతమంది ఫన్నీగా రియాక్ట్ అవుతూ..  "ఆదాయ పన్ను శాఖ అధికారులకు కాల్ చేయండి" అంటూ ఛమత్కరిస్తున్నారు.