తాజ్ మహల్ ను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక బుక్ లెట్ లో చేర్చకపోవడంతో మొదలైన రగడ ఇప్పటికీ చర్చనీయాంశయంగానే ఉంది. ఈ అంశంపై బీజీపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతోంది. ప్రధాని మోదీ 'తాజ్ మహల్' అంశంపై స్పందించినా.. చారిత్రక కట్టడంపై పలు వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజ్ మహల్ పై తనదైన రీతిలో స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలు పెట్టారు. ఇంతకీ, తాజ్ మహల్ ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెప్పండి.  కనీసం, మా పిల్లలను తీసుకెళ్లి చివరిసారిగా తాజ్ మహల్ ను చూపిస్తాము’ అని తన ట్వీట్ ఖాతాలో ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.


అంతకుముందు చేసిన మరో ట్వీట్ లో ‘నేను ప్రశ్నించడం కొనసాగిస్తా. అది నా ప్రాథమిక హక్కు... నా భావాలను విభేదించే హక్కు ప్రతిఒక్కరికీ ఉంది. కానీ, నాపై అదేపనిగా ఎవరైతే విమర్శలు గుప్పిస్తున్నారో వారి పదజాలం అభ్యంతరకరంగా ఉంది. మీరు చేసే ప్రతి దుర్భాష కారణంగా నా భావాలను మరింత ధైర్యంగా చెప్పే శక్తినిస్తుంది. నేను మీ ముసుగు వెనక ఉన్న ముఖాన్ని స్పష్టంగా చూడగలను... ’  అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.