ఆసియా కప్ నుండి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ప్రకటించిన సెలక్టర్లు.. ఆయన స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్‌గా తీసుకొన్న సంగతి తెలిసిందే. భారత జట్టు వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో త్వరలో సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో ప్రస్తుత కెప్టెన్‌కు సెలక్టర్లు విశ్రాంతి ప్రకటించారు. అయితే భారత్ తరఫున ఈసారి ఆసియా కప్‌కు కోహ్లీ ఆడలేకపోవడం అనేది తమకు కలిసొచ్చే అంశమని పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ అభిప్రాయపడ్డారు. సెప్టెంబరు 15 తేది నుండి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభమవుతోందన్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో హసన్ అలీ మాట్లాడుతూ "ఇండియాతో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ క్రీడాకారుల్లో ఎంతో ఉత్సాహం నిండుకొని ఉంటుంది. కానీ ఈసారి కోహ్లీ మాతో ఆడకపోవడం అనేది మాకు బాగా కలిసొచ్చే అంశం. ఎందుకంటే భారత్ కష్టాల్లో ఉన్నప్పడు.. కోహ్లీ ఒక్కడే సరైన నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపించగలడు. కోహ్లీ లాంటి బ్యాట్స్‌మన్‌ని ఔట్ చేయాలనే ఎలాంటి బౌలర్ అయినా కోరుకుంటాడు. కానీ ఈ సారి మాకు ఆ అవకాశం లేదు" అని హసన్ అలీ అన్నాడు.


సెప్టెంబరు 15వ తేది నుండి 28వ తేది వరకు ఆసియా కప్ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యూఏఈలో జరుగుతుంది. ఈసారి ఈ కప్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంగ్ కాంగ్ జట్లు పోటీ పడనున్నాయి. భారత్ తరఫున ఈ సారి ఈ రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోగా.. శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.