అప్పటి వరకు అంబటి రాయుడు బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం !
భారత క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా నిషేధం విధించిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)
టీమిండియా బ్యాట్స్‌మన్, పార్ట్ టైం బౌలర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా జనవరి 12న సిడ్నీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో అంబటి రాయుడు అనుమానాస్పదంగా బౌలింగ్ చేశాడని ఆ మ్యాచ్ రిఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఐసీసీ.. రాయుడు తన బౌలింగ్ యాక్షన్ నిరూపించుకోవాలని సూచిస్తూ అతడికి 14 రోజుల గడువు విధించింది. అయితే, నిర్దిష్ట కాల వ్యవధిలో రాయుడు బౌలింగ్ శైలిని నిరూపించుకునేందుకు తమ ఎదుట హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ.. నిబంధనల ప్రకారమే అతడి బౌలింగ్‌పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది.
అంబటి రాయుడు తన బౌలింగ్ శైలి పరీక్షకు హాజరై, తనను తాను నిరూపించుకునే వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది. అప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రాయుడి బౌలింగ్‌పై నిషేధం అమలులో వుండనున్నట్టు ఈ సందర్భంగా ఐసీసీ తేల్చిచెప్పింది.