Andre Russell: రసెల్ విధ్వంసం.. 32 బంతుల్లో 90 పరుగులు! టీ10 టైటిల్‌ను ముద్దాడిన డెక్కన్ గ్లాడియేటర్స్!!
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ మరోసారి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. బౌలర్లను ఊచకోత కోస్తూ 32 బంతుల్లో అజేయంగా 90 పరుగులు చేశాడు. దాంతో అబుదాబి టీ10 టైటిల్‌ను డెక్కన్ గ్లాడియేటర్స్ తొలిసారి ముద్దాడింది.
Andre Russell 90 runs helps Deccan Gladiators lift Abu Dhabi T10 title for 1st time: వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ (Andre Russell) మరోసారి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. బౌలర్లను ఊచకోత కోస్తూ 32 బంతుల్లో అజేయంగా 90 పరుగులు చేశాడు. రసెల్ తన తుఫాను ఇన్నింగ్స్‌లో ఏకంగా 16 బౌండరీలు కొట్టాడు. ఇందులో 7 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 280 కంటే ఎక్కువ ఉండడం విశేషం. రసెల్ విధ్వంసంతో ఢిల్లీ బుల్స్‌పై 56 పరుగుల తేడాతో డెక్కన్ గ్లాడియేటర్స్ (Deccan Gladiators) ఘన విజయం సాధించింది. దాంతో అబుదాబి టీ10 (Abu Dhabi T10) టైటిల్‌ను డెక్కన్ గ్లాడియేటర్స్ తొలిసారి ముద్దాడింది.
అబుదాబి టీ10 2021 ఫైనల్ మ్యాచ్ డెక్కన్ గ్లాడియేటర్స్, ఢిల్లీ బుల్స్ (Deccan Gladiators vs Delhi Bulls) జట్ల మధ్య షేక్ జాయెద్ స్టేడియంలో శనివారం (డిసెంబర్ 4) రాత్రి జరిగింది. ఈ మ్యాచులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 159 పరుగులు చేసింది. ఓపెనర్లు కోహ్లర్ కాడ్మోర్ (Kohler-Cadmore), ఆండ్రీ రసెల్ (Russell) ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి బంతి నుంచే బుల్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దాంతో 4.1 ఓవర్లలోనే గ్లాడియేటర్స్ 50 పరుగులు చేసింది. ముఖ్యంగా రసెల్ బౌండరీలే లక్ష్యంగా ఆడాడు.
Also Read: Terror Attack: మాలిలో ఉగ్ర బీభత్సం-31 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
ఆండ్రీ రసెల్ (Andre Russell) కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. టోర్నీలో విండీస్ హిట్టర్ తొలిసారి హాఫ్ సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ అనంతరం రసెల్ విధ్వంసం తారాస్థాయికి చేరింది. బౌండరీలు, సిక్సులతో మైదానాన్ని హోరెత్తించాడు. దాంతో డెక్కన్ గ్లాడియేటర్స్ స్కోర్ 7వ ఓవర్‌లోనే 100 దాటింది. మరోవైపు కోహ్లర్ కాడ్మోర్ కూడా సిక్సులు వర్షం కురిపిస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. చివరి 3 ఓవర్లలో 58 పరుగులు రావడంతో గ్లాడియేటర్స్ 159 పరుగులు చేసింది. కాడ్మోర్ 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. బుల్స్ బౌలర్లు అందరూ విఫలమయ్యారు.
Also Read: Nagaland: నాగాలాండ్‌లో హైటెన్షన్-సాధారణ పౌరులపై ఆర్మీ జవాన్ల కాల్పులు-ఆరుగురు మృతి
160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బుల్స్ నీర్ణీత 10 ఓవరల్లో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులే చేసింది. బుల్స్ బ్యాటరల్లో చంద్రపాల్ హేమ్‌రాజ్ (Chandrapaul Hemraj) 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 14 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. స్టార్ ప్లేయర్స్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, డొమినిక్ డ్రేక్స్, డ్వేన్ బ్రావో ఖాతా తెరవలేకపోయారు. గ్లాడియేటర్స్ ఫాస్ట్ బౌలర్ టైమల్ మిల్స్ 2 ఓవర్లలో 4 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఒడియన్ స్మిత్, వనిందు హసరంగా చెరో రెండు వికెట్లు సాధించారు. 'ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్'గా ఆండ్రీ రసెల్.. 'ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్'గా వనిందు హసరంగా ఎంపికయ్యారు.