దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ 2018లో భాగంగా టీమిండియా మంగళవారం హాంకాంగ్‌ జట్టుతో తలపడనుంది. ఆ తరువాత చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశం పాకిస్థాన్‌తో బుధవారం మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ తిలకించేందుకు చాలామంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు. హాంకాంగ్‌తో జరిగే మ్యాచ్‌ ట్రయిలర్‌లో భాగం అని పలువురు క్రికెట్‌ అభిమానులు చెబుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి పాక్‌కి సత్తా చూపించాలని భారత్ భావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్‌ కోహ్లీ లేకుండా టీమిండియా ఆసియా కప్‌ బరిలోకి దిగుతోంది. జట్టు బాధ్యతలను రోహిత్‌ శర్మ తీసుకున్నాడు. హాంకాంగ్‌ చిన్న జట్టే అయినా తేలిగ్గా తీసుకోలేమని టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ అభిప్రాయపడుతున్నారు. హాంకాంగ్‌పై ప్రదర్శించే ఆటతీరు, బుధవారం రోజు జరిగే పాకిస్థాన్‌ మ్యాచ్‌పై ప్రభావం పడనుంది. కాగా భారత్ వర్సెస్ హాంకాంగ్ మ్యాచ్ సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది.


రోహిత్‌ శర్మ, ధోని, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, కేదార్‌ జాదవ్‌లు బ్యాట్‌తో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బౌలింగ్‌లో బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దిప్‌ యాదవ్‌తో పాటు యుజువేంద్ర చాహల్‌ ఉన్నారు.


ఇంతకుముందు భారత్‌, హాంకాంగ్‌ ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. 2008 ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 256 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ధోని, రైనాలు సెంచరీ చేయడంతో టీమిండియా 374 పరుగులు చేసింది.


తుది జట్లు (అంచనా)... భారత్‌: రోహిత్‌, ధావన్‌/రాహుల్‌, అంబటి రాయుడు, మనీష్‌ పాండే, ధోని/కార్తీక్‌, కేదారజ్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య/అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా/ఖలీల్‌, చాహల్‌


హాంకాంగ్‌: నిజ్కత్‌ ఖాన్‌, అన్షుమాన్‌ రాఠ్‌, బాబర్‌ హయత్‌, కించిత్‌ షా, క్రిస్టొఫర్‌ కార్టర్‌, ఎహ్‌సాన్‌, ఇజాజ్‌, స్కాట్‌ మెకెనీ, అఫ్జల్‌,  నవాజ్‌, నదీమ్‌ అహ్మద్