వైరల్ వీడియో: ధోనిపై అభిమానాన్ని చాటుకున్న పాక్ ఆల్-రౌండర్ క్రికెటర్
మహేంద్ర సింగ్ ధోనికి షోయబ్ మాలిక్ అభివాదం
పాకిస్తాన్ మాజీ కెప్టేన్, ఆల్-రౌండర్ షోయబ్ మాలిక్ టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు. దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఇవాళ ప్రారంభమైన ఆసియా కప్ 2018 టోర్నమెంట్‌లో పాల్గొనేందుకుగాను సెప్టెంబర్ 13కే అన్ని జట్లు దుబాయ్ చేరుకోగా సెప్టెంబర్ 14న భారత్, పాక్ జట్ల ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా మైదానంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న చోటకు వెళ్లిన షోయబ్ మాలిక్ అక్కడే ఉన్న మహేంద్ర సింగ్ ధోనికి నమస్తే అంటూ అభివాదం చేశాడు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింప్లీ సూపర్ అయిన ఆటగాడు ధోనికి ఎవరైనా సలాం అనాల్సిందే అంటూ ఆ వీడియో కింద ధోనికి అనుకూలంగా కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి.