సూపర్-4 సమరం ; నేడు బంగ్లాతో టీమిండియా ఢీ
ఆసియాకప్: టీమిండియా ఆటగాళ్లు ఆరంభం మ్యాచ్‌లో హాంకాంగ్‌పై కంగారుపడ్డారు.. వెంటనే తేరుకొని చిరకాల ప్రత్యర్ధిపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పాక్ పై విజయంతో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకున్న టీమిండియా ఈ రోజు సూపర్-4 సమరంలో బంగ్లాతో ఢీకొట్టేందుకు సిద్ధమౌతుంది. టీమిండియాతో పోల్చితే బంగ్లాదేశ్ బలహీన జట్టు అయినప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్లో బంగ్లాదేశ్ ఎప్పుడూ ప్రమాదకర జట్టేనని క్రీడా పండితులు వార్నింగ్ ఇస్తున్నారు. ఒకప్పటిలా బంగ్లా పసికూనేం కాదు .. ఎలాంటి జట్టునైనా ఓడించగల నాణ్యత ఇప్పుడు ఆ జట్టులో ఉంది. అఫ్గాన్ చేతిలో ఓడినప్పటికీ బంగ్లాతో పోరు తేలికేమీ కాదు. దీంతో భారత జట్టు బంగ్లాపై ఎలాంటి ప్రదర్శన ఇస్తందనే దానిపై ఉత్కంఠత నెలకొంది
జట్టు కూర్పుపై తర్జన భర్జన
ఆసియా కప్ లో ప్రతీ మ్యాచ్ ను సీరియస్ గా తీసుకుంటకున్న టీమిండియా.. బంగ్లా మ్యాచ్ కూడా అదే తరహాలో చూస్తోంది. జట్టు కూర్పు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భువనేశ్వర్‌కు విశ్రాంతినిచ్చే అవకాశముంది. అతని స్థానంలో ఎడమచేతివాటం పేసర్ ఖలీల్ అహ్మద్ జట్టులోకి రావొచ్చు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానాన్ని కేదార్ జాదవ్ భర్తీ చేయనున్నాడు.
ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మంచి ఫామ్‌లో ఉండడం.. పాక్ పై అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ రాణించడం వంటి పరిణామాలు భారత్‌కు సంతోషాన్నిచ్చే అంశాలు. ఐతే ధోని బ్యాటింగే జట్టు మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఫాంతో సంబంధం లేకుండా కీలక తరుణంలో జట్టును ఆదుకోవడంలో సిద్ధహస్తడు ధోనీ. ఈ విషయంలో పెద్దగా కంగారుపడాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి