ఆసియా కప్ వేదిక.. భారత్ నుండి తరలిపోయింది..!
భారత్ వేదికగా నిర్వహించాల్సిన 2018 ఆసియా కప్, యఏఈ దేశానికి తరలిపోయింది.
భారత్ వేదికగా నిర్వహించాల్సిన 2018 ఆసియా కప్, యఏఈ దేశానికి తరలిపోయింది. ఇండియాకి వచ్చి క్రికెట్ ఆడేందుకు పాక్ క్రికెటర్లు తమ సంసిద్ధతను తెలియజేయకపోవడంతో ఆఖరి నిముషంలో.. ఈ టోర్నిని యూఏఈలో నిర్వహించాలని అనుకుంటున్నామని ఏసీసీ (ఆసియన్ క్రికెట్ కౌన్సిల్) ప్రకటించింది. రాబోయే సెప్టెంబరులో ఇదే టోర్ని ఇండియాలో జరగాల్సి ఉండగా.. వేదికలను మార్చమని పాకిస్తాన్ డిమాండ్ చేయడంతో పాటు పాక్ క్రికెటర్లకు తాము ఎలాంటి ఆతిధ్యం ఇవ్వాలని భావించడం లేదని కూడా ఇండియా తెలపడంతో అనివార్య పరిస్థితుల్లో వేదికను మార్చాల్సి వచ్చింది.
సెప్టెంబరు 13 నుండి 28 తేది వరకు షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటీవలే కౌలాలంపూర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఏసీసీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్థాన్ దేశాలు పాల్గొననున్నాయి. యూఏఈ ఆతిథ్య జట్టుగా పాల్గొంటుండగా.. హాంగ్‌కాంగ్, నేపాల్, సింగపూర్, మలేషియా, ఓమన్‌ల నుంచి ప్లేఆఫ్ మ్యాచ్‌ల ద్వారా ఇంకొక జట్టును ఎంపిక చేయడం జరుగుతుంది.