ఆసియా క్రీడల్లో సంచలనం: సెపక్‌తక్రా మ్యాచ్‌లో భారత్‌కు తొలి పతకం
సెపక్‌తక్రా... వియత్నాం, మయన్మార్, థాయిలాండ్, ఇరాన్, జపాన్, సింగపూర్, లావోస్, చైనా, ఇండోనేషియా, కొరియా లాంటి దేశాలలో మాత్రం బాగా పాపులర్ అయిన ఈ ఆటలో భారత్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది.
సెపక్‌తక్రా... వియత్నాం, మయన్మార్, థాయిలాండ్, ఇరాన్, జపాన్, సింగపూర్, లావోస్, చైనా, ఇండోనేషియా, కొరియా లాంటి దేశాలలో మాత్రం బాగా పాపులర్ అయిన ఈ ఆటలో భారత్ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తోంది. అయితే అనూహ్యమైన రీతిలో ఈసారి ఆసియా క్రీడల్లో భారత్, ఈ సెపక్‌తక్రా ఆట పురుషుల విభాగంలో తొలి పతకం కైవసం చేసుకుంది. సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ థాయిలాండ్ చేతిలో 0-2 స్కోరుతో ఓడినప్పటికీ.. మూడవ స్థానం పొందిన హోదాలో భారత్ కాంస్య పతకం కైవసం చేసుకుంది.
అంతకు ముందే ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 స్కోరుతో గెలుపొందింది. అయితే ఇరాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో భారత్ సెమీస్‌లోకి దూసుకెళ్లి పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ విధంగా సెపక్‌తక్రా చరిత్రలోనే తొలిసారిగా ఆసియా క్రీడల్లో భారత్ పతకం పొందినట్లయింది. భారత్ సెపక్‌తక్రా విభాగంలో కాంస్యం గెలవడంతో సెపక్‌తక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ యోగీంద్ర సింగ్ దహియా తన హర్షాన్ని వ్యక్తం చేశారు.
ఆసియా క్రీడలకు సంబంధించి సెపక్‌తక్రా ఆటలో ఇప్పటికి రికార్డు స్థాయిలో థాయిలాండ్ అన్ని విభాగాల్లో కలిపి 22 సార్లు స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. మయన్మార్ 5 సార్లు, మలేషియా 3 సార్లు, వియత్నాం 2 సార్లు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాయి.