ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్ మన్‌జీత్ సింగ్ స్వర్ణ పతకం సాధించాడు. 800 మీటర్ల పరుగు పందెంలో ఆయన ఈ ఘనతను సాధించాడు. 800 మీటర్ల పరుగు పందేన్ని 1:46.15 నిముషాల్లో పూర్తి చేసిన మన్‌జీత్ ప్రథమ స్థానంలో నిలవగా.. 1:46.35తో నిముషాల్లో రెండో స్థానంలో నిలిచిన మరో భారతీయ అథ్లెట్ జిన్సన్ జాన్సన్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. పోటీ ప్రారంభమైనప్పుడు నాలుగో స్థానంలో ఉన్న మన్‌జీత్.. చివరి నిముషాల్లో అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా క్రీడల చరిత్రలో ఈ విభాగంలో భారత్‌కి ఇది ఆరో స్వర్ణం. 1982లో చార్లెస్ బోరామియో బంగారు పతకం సాధించిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అనగా.. దాదాపు 36 ఏళ్ల తర్వాత భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరడం గమనార్హం. అలాగే 800 మీటర్ల పరుగు పందేంలో స్వర్ణం, రజత పతకాలు భారతీయులే సాధించడం ఇదే మొదటిసారేమీ కాదు. ఇదే విచిత్రం 1951లో కూడా జరిగింది. 1951లో 800 మీటర్ల పరుగు పందెంలో రంజిత్ సింగ్ స్వర్ణం సాధిస్తే.. కుల్వంత్ సింగ్ రజత పతకాన్ని పొందారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆసియా క్రీడల్లో ఆ మ్యాజిక్ నమోదైంది. 


800 మీటర్ల పరుగు పందెంలో భారత్‌కు రెండు పతకాలు తీసుకొచ్చిన ఇద్దరు అథ్లెట్లపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇద్దరు అథ్లెట్లను ప్రశంసిస్తూ తన ట్విట్టర్‌లో అభినందనలను పోస్టు చేశారు. వీరి ప్రదర్శన దేశం మొత్తానికి గర్వకారణం అని పేర్కొన్నారు. అలాగే  కేంద్ర మంత్రి రాజవర్థన్ సింగ్ రాథోడ్ కూడా క్రీడాకారులను అభినందించారు. వారి ప్రదర్శనను బ్రిలియంట్ రన్‌గా ఆయన కితాబిచ్చారు.