కిదాంబి శ్రీకాంత్‌కి డిప్యూటి కలెక్టర్ హోదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఆర్డర్లు జారీచేసింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఆర్డర్లు జారీచేసింది. శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్‌ను గెలుచుకున్న సందర్భంగా గత సంవత్సరం జూన్ 28 తేదిన విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన సన్మాన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రూపు-1 ఉద్యోగం ఇస్తానని హామి ఇచ్చారు.
సీఎం ఇచ్చిన హామీ మేరకు క్రీడాశాఖ జీఓ నంబరు 136ను జారీ చేసింది. ఈ జీఓ మేరకు కిదాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 7, 1993న గుంటూరులో జన్మించిన కిదాంబి శ్రీకాంత్.. బ్యాడ్మింటన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యధిక ర్యాంకు కలిగిన భారతీయ ఆటగాడిగా కూడా ఘనతకెక్కాడు
ప్రపంచ బ్యాడ్మింటన్ లో అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరొంది అభిమానులచే "సూపర్ డాన్"గా పిలవబడుతున్న లిన్ డాన్‌ను కిదాంబి శ్రీకాంత్ 21-19 21-17 తేడాతో ఓడించి 2014 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ గెలుచుకొని ఒక సంచలనమే నమోదు చేశాడు. 2017లో నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా గెలిచాడు శ్రీకాంత్. తాజా ఉత్తర్వుల మేరకు డిప్యూటీ కలెక్టరు బాధ్యతలు చేపట్టిన శ్రీకాంత్.. 30 రోజుల్లో ఉద్యోగంలో చేరి.. ఏపీ భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనరేట్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని.. రెవెన్యూ డిపార్టుమెంట్ ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ తెలిపారు