బాల్ టాంపరింగ్ వివాదంలో తనపై క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన ఏడాది నిషేధాన్ని సవాల్ చేయబోనని ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించారు. 'కెప్టెన్‌గా ఈ వివాదానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుంటామని ముందే చెప్పాను. ఆ మాటకు కట్టబడి ఉంటాను. నాపై విధించిన ఆంక్షలను సవాల్ చేయడం లేదు. క్రికెట్ ఆస్ట్రేలియా గట్టి సందేశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. వారి చర్యలను నేను ఆమోదిస్తున్నాను' అని స్మిత్‌ బుధవారం ట్వీట్‌ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


బాల్‌ టాంపరింగ్ వివాదంలో స్మిత్‌, వార్నర్‌పై ఏడాది చొప్పున నిషేధం విధించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. బెన్‌క్రాఫ్ట్‌ను తొమ్మిది నెలలు దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి నిషేధించిన సంగతి తెలిసిందే..! ఈ నిషేధం నేపథ్యంలో స్మిత్‌, వార్నర్‌ ఐపీఎల్‌ నుంచి కూడా ఏడాదిపాటు వైదొలగనున్నారు. స్మిత్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఈ సారి కెప్టెన్సీ నిర్వహించాల్సి ఉంది. వార్నర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌ జట్టు ఐపీఎల్‌ బరిలో దిగాల్సి ఉండేది.


మరోవైపు వార్నర్, బాన్‌క్రాఫ్ట్ తమ నిషేధాలపై అప్పీల్ చేస్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ మాత్రం ఈ ముగ్గురికీ అండగా నిలిచింది. వాళ్లకు విధించిన శిక్షలు చాలా ఎక్కువని, వాటిని తగ్గించాల్సిందేనని క్రికెట్ ఆస్ట్రేలియాను డిమాండ్ చేసింది. కొంత మంది క్రికెటర్లు ఈ ముగ్గురికి విధించిన శిక్షలు చాలా ఎక్కువే అంటూ సానుభూతి చూపిస్తున్నారు.