బాల్ ట్యాంపరింగ్ కేసులో.. ఆసీస్ ఆటగాళ్ళను శిక్షించిన ఐసీసీ
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు కెమెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ జరిపాడని భావించిన ఐసీసీ బోర్డు అతని మ్యాచ్ ఫీజులో 75% కోతను విధించింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఆటగాడు కెమెరాన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్ జరిపాడని భావించిన ఐసీసీ బోర్డు అతని మ్యాచ్ ఫీజులో 75% కోతను విధించింది. అలాగే కెప్టెన్ స్టీవ్ స్మిత్ పై ఓ టెస్టు మ్యాచ్ నిషేధంతో పాటు 100 శాతం మ్యాచ్ ఫీజు కోతను విధించింది. ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.2.1 ప్రకారం ఆట స్ఫూర్తిని దెబ్బతీసినందుకు వీరికి ఈ శిక్ష విధిస్తున్నామని ఐసీసీ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్ సన్ తెలిపారు.
స్మిత్ ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానని తెలిపారు. కాకపోతే మ్యాచ్ సస్పెన్షన్ బదులుగా, సస్పెన్షన్ పాయింట్లు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ పాయింట్లు మ్యాచ్ సస్పెషన్‌తో సరిసమానంగా ఉండి ఆటగాడి కెరీర్ రికార్డులో నాలుగు డీ మెరిట్ పాయింట్లను జత చేస్తాయి. అయితే స్మి్త్ కోరినట్లు ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందో లేదో ఇంకా తెలియదు
ఈ విషయం పై ఐసీసీ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ సన్ ఈ విధంగా స్పందించారు. "ఈ విషయంలో ఆసీస్ టీమ్ చేసిన పనికి పూర్తి బాధ్యతను కెప్టెన్ స్మిత్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆసీస్ ఆటగాళ్లు చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. ఇటీవలి కాలంలో మైదానంలో స్లెడ్జింగ్ పేరుతో జరుగుతున్న పరస్పర దూషణలు, అంపైర్ల మాటలను లక్ష్య పెట్టకపోవడంతో పాటు బాల్ ట్యాంపరింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి.
క్రికెటర్లు ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఈ విషయంలో క్రీడా జట్లే కాదు... వారు ఎలా
ప్రవర్తించాలో వారి ప్రభుత్వాలు కూడా వారికి నేర్పాలి. గెలవడం అనేది క్రీడలో చాలా ముఖ్యం. కానీ క్రీడ విలువను తగ్గించి గెలవడం అనేది మాత్రం క్షమార్హం కాదు." అని ఆయన అన్నారు