చైనా ఓపెన్ టోర్నమెంట్ పోటీల్లో భాగంగా నేడు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో జపాన్ షట్లర్ కెంటొ మొమొటా చేతిలో ఇండియన్ స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. ఆటలో వరల్డ్ చాంపియన్ కెంటో మెమొటాకు కిదాంబి శ్రీకాంత్ గట్టిపోటినివ్వలేకపోయాడు. 4-5 పాయింట్స్ వద్ద ఒక పాయింట్ ఆధిక్యం ప్రదర్శించిన శ్రీకాంత్ ఆ తర్వాత కెంటొ మొమొటా ఆధిపత్యం ముందు నిలువలేకపోయాడు. అదే సమయంలో కెంటొ వరుసగా 5 పాయింట్స్ రాబట్టుకోవడంతో కిదాంబి 5 పాయింట్స్ వెనుకబడిపోయాడు. 11-6 పాయింట్స్ వద్ద మరోసారి కెంటో వరుసగా 8 బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ గెలుచుకోవడంతో శ్రీకాంత్ చేతి నుంచి విజయం పూర్తిగా చేజారిపోయింది. ఫలితంగా కేవలం 28 నిమిషాల వ్యవధిలోనే ముగిసిన ఈ ఆటలో ఓటమిపాలైన కిదాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ 2018 నుంచి నిష్క్రమించకతప్పలేదు. 


అంతకన్నా ముందు జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ షట్లర్ సుప్పాన్యు అవిహింగ్‌సనన్‌ని ఓడించిన అనంతరం కిదాంబి క్వార్టర్స్‌కి చేరిన సంగతి తెలిసిందే. ఇక జపాన్ షట్లర్ కెంటొ మొమొటా విషయానికొస్తే, చైనాకు చెందిన షి యుకితో మొమొటా సెమీ ఫైనల్స్‌లో తలపడనున్నాడు.