వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. వెస్టిండీస్‌-బంగ్లాదేశ్‌ దేశాల మధ్య ఆదివారం జరిగిన మూడో వన్డేలో గేల్ ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఈ ఘనతతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా గేల్ రికార్డుల్లోకెక్కాడు. అయితే ఈ రికార్డును ఆయన పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిదితో కలిసి పంచుకోవడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేయడానికి నిశ్చయించుకున్న బంగ్లాదేశ్ ఆరు వికెట్ల నష్టానికి 301 పరుగులు చేయగా.. ఆ తర్వాత వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగిన గేల్ రెచ్చిపోయి ఆడాడు. 66 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఆ పరుగుల్లో 5 సిక్స్‌లు, 6 ఫోర్లు ఉండడం విశేషం. ప్రస్తుతం గేల్ ఖాతాలో 476 సిక్స్‌లు ఉండడం గమనార్హం. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో షాహిద్ ఆఫ్రిది ఖాతాలో కూడా 476 సిక్స్‌లు ఉండడం విశేషం. కాకపోతే ఆఫ్రిది 524 మ్యాచ్‌లలో 476 సిక్స్‌లు కొడితే.. గేల్ 443 మ్యాచ్‌ల్లోనే ఆ రికార్డును నమోదు చేశాడు. 


ఈ సంవత్సరం ఆగస్టు 1వ తేది నుండి వెస్టిండీస్, బంగ్లాదేశ్ దేశాల మధ్య టీ20 మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఈ మ్యాచ్‌ల్లో గేల్ కనీసం ఒక సిక్స్ కొట్టినా సరే ఆఫ్రిది రికార్డు బ్రేక్ అయిపోతుందని చెప్పవచ్చు. కాగా.. గేల్ సిక్సర్లు బాదినా.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ఆఖరి వన్డేలో వెస్టిండీస్ 18 పరుగులతో ఓడి సిరీస్‌ను చేజార్చుకోవడం గమనార్హం.