గోల్డ్‌కోస్ట్‌: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం వరించింది. వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మరో స్వర్ణ పతాకాన్ని భారత్ కైవసం చేసుకుంది. శనివారం ఉదయం జరిగిన  77 కేజీల విభాగం పోటీల్లో 25 ఏళ్ల సతీశ్‌ కుమార్‌ శివలింగం ఈ ఘనత సాధించారు. మొత్తం 317 కేజీల బరువునెత్తి అద్భుత ప్రదర్శన కనబరిచిన సతీష్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు. తమిళనాడు వెల్లూరుకు చెందిన సతీష్‌  2014లో కామన్వెల్త్ గేమ్స్‌లోనూ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు భారత్ కు  మూడు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం, ఒక కాంస్య పతకం లభించాయి. వచ్చిన ఈ ఐదు పతకాలూ కూడా వెయిట్ లిఫ్టింగ్‌లోనే కావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్వర్ణ పతకంతో ప్రస్తుతం భారత్, పతకాల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతోంది. 14  స్వర్ణాలు, 11  రజతాలు, 16  కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, 12 స్వర్ణాలు, 8  రజతాలు, 3 కాంస్యాలతో ఇంగ్లాండ్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. భారత్ తర్వాతి స్థానాల్లో కెనడా, స్కాట్లాండ్, సౌతాఫ్రికా, మలేషియా, న్యూజిలాండ్, వేల్స్, బెర్ముడా దేశాలు((టాప్-10లో) ఉన్నాయి


కాగా.. 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనత గురురాజ్ కే దక్కింది. గురువారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో మహిళ విభాగంలో మీరాబాయి చాను(48 కేజీల పోటీ) స్వర్ణాన్ని గెలుపొందగా, పురుషుల విభాగంలో పి గురురాజ్ 56 కేజీల విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు.  శుక్రవారం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో  మహిళల విభాగంలో సంజిత చాను స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో వెయిట్ లిఫ్టర్ దీపక్ లాతర్ 69 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో ఇప్పటి వరకూ భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం, ఒక కాంస్య పతకం లభించాయి.