ఒంటిచేత్తో క్యాచ్ పట్టాడు..క్యాష్‌ప్రైజ్ కొట్టేశాడు
ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌లో ఆటగాళ్లు సిక్సర్ల వర్షం కురిపించగా.. రాస్ టేలర్ కొట్టిన సిక్సర్ అభిమానులపై కనకవర్షం కురిపించింది
ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌లో ఆటగాళ్లు సిక్సర్ల వర్షం కురిపించగా.. రాస్ టేలర్ కొట్టిన సిక్సర్ అభిమానిపై కనకవర్షం కురిపించింది. మ్యాచుల్లో ఆటగాళ్లు క్యాచులు పడితే వికెట్లు కోల్పోవడం సహజం. కానీ, ఈ అభిమాని క్యాచ్‌కు ఏకంగా కాసులు రాలాయి.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో 19.5 ఓవర్‌లో రాస్‌టేలర్ భారీ సిక్సర్ కొట్టాడు. ఆ బంతిని స్టాండ్స్‌లో నిల్చొన్న మిచెల్ గ్రిమ్‌స్టోన్(20) ఒంటిచేత్తో పట్టేశాడు. సిరీస్ శీతల పానీయాల ప్రచారదారు సంస్థ ఈ అభిమానికి 50 వేల డాలర్లు ప్రకటించింది.
సాధారణంగా స్టాండ్స్‌లోకి వచ్చిన ఆటగాళ్లు కొట్టిన బంతుల్ని క్యాచ్‌లు పట్టుకోవడం అంటే అభిమానులకు ఎంతో సరదా. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాంటి వినోదాలు చూస్తూనే ఉంటాం. కానీ మిచెల్ లక్కీ. అందుకే క్యాచ్‌తో పాటు క్యాష్‌ప్రైజ్ పట్టేశాడు. మ్యాచ్ అనంతరం రాస్ టేలర్ ఈ అభిమానితో ఫోటో దిగి ఇంస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. బాల్, గ్లోవ్స్‌ను రాస్ టేలర్ ఈ అభిమానికి గుర్తుగా ఇచ్చాడు.