Shane Warne Ball of the Century: షేన్ వార్న్ `బాల్ ఆఫ్ ది సెంచరీ`.. చూస్తే మతులు పోవాల్సిందే (వీడియో)!!
Shane Warne`s Ball of the Century video: క్రికెట్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షేన్ వార్న్ `బాల్ ఆఫ్ ది సెంచరీ` వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Fans remember Australia great Shane Warne's Ball of the Century : క్రికెట్ స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియన్ మాజీ ప్లేయర్ షేన్ వార్న్ మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండె నొప్పితో బాధపడుతూ మరణించారు. వార్న్ తన విల్లాలో అచేతనంగా పడి ఉండడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారు. షేన్ వార్న్ అకాల మృతితో క్రీడాలోకం మొత్తం దిగ్బ్రాంతికి గురైంది. ఫాన్స్, మాజీలు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.
షేన్ వార్న్ స్పిన్ మాయాజాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో గింగిరాలు తిరిగే బంతులతో మేటి బ్యాటర్‌లను సైతం హడలెత్తించారు. ప్రత్యర్థి జట్లకు ఓ సింహ స్వప్నంలా మారారు. షేన్ వార్న్ వేసే బంతి ఎటువైపు వెళుతుందో అని కొందరు బ్యాటర్లు ముందే అయోమయానికి గురై వికెట్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా లెగ్ స్టంప్‌కు ఆవల బంతి వేస్తూ.. ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టడంలో వార్న్ దిట్ట. అతను వేసిన ఓ డెలివరీ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'గా చరిత్రలో నిలిచిపోయింది. ఆ వివరాలు ఓసారి చూద్దాం.
1993 జూన్ 4న మాంచెస్టర్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 289 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ అథర్టన్ త్వరగానే ఔట్ అయ్యారు. ఆపై స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగల మైక్ గాటింగ్ క్రీజులోకి వచ్చారు. అప్పటికీ షేన్ వార్న్ ఎంట్రీ ఇచ్చి సంవత్సరమే కాగా.. 11 టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అయినా కూడా ఆసీస్ కెప్టెన్ అలెన్ బోర్డర్ నమ్మకంతో వార్న్‌కు బంతినిచ్చారు. బంతిని అందుకున్న వార్న్.. ఫీల్డింగ్ సెట్ చేసుకుని తన మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించారు.
షేన్ వార్న్ నెమ్మదిగా రనప్ చేసి వచ్చి మొదటి బంతి వేశారు. బంతి లెగ్ స్టంప్ లైన్‌కు కొన్ని అంగుళాల అవతల పడింది. దాంతో ప్యాడు, బ్యాట్‌ను అడ్డుపెట్టి బంతిని ఎదుర్కోవాలని మైక్ గాటింగ్ చూశారు. అనూహ్యంగా స్పిన్ అయిన ఆ బంతి.. ప్యాడు, బ్యాట్‌ను దాటి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఆసీస్ వికెట్ కీపర్ ఇయాన్ హీలితో పాటు జట్టు ఆటగాళ్లంతా సంబురాల్లో మునిగిపోయారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో అని గాటింగ్, అంపైర్ ఆశ్చర్యపోయారు. ఆపై బంతి ఇలా ఎలా స్పిన్ అయిందనేలా బిత్తర చూపులు చూసుకుంటూ గాటింగ్ పెవిలియన్ బాట పట్టారు.
ఆ ఒక్క బంతితో షేన్ వార్న్ ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చారు. ఇక చరిత్ర ఆ బంతికి సరైన గౌరవం ఇచ్చింది. వార్న్ వేసిన ఆ బాల్ ను 'బాల్ ఆఫ్ ది సెంచరీ'గా ఐసీసీ ప్రకటించింది. అప్పుడు మొదలైన ఈ మాంత్రికుడి ప్రస్థానం సుమారు రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా షేన్ వార్న్ నిలిచారు. శుక్రవారం వార్న్ మరణం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'కి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఫాన్స్ అందరూ ఈ వీడియో చూస్తూ అతడిని గుర్తుచేసుకుంటున్నారు. ఇదివరకు ఈ వీడియో చూడని ఫాన్స్ మతులు పోతున్నాయి.
Also Read: Next Covid Variant: కోవిడ్ తదుపరి వేరియంట్ జంతువుల నుంచి..? సైంటిస్టుల హెచ్చరిక..
Also Read: MS Dhoni: బస్సు డ్రైవర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మరీ దూసుకెళ్లాడు (వీడియో)!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook