Ross Taylor Tongue Poking: రాస్ టేలర్ నాలుక బయటకు ఎందుకు చూపిస్తాడంటే!
సెంచరీ సెలబ్రేషన్ ఒక్కో క్రికెటర్‌కు ఒక్కో స్టైల్ ఫాలో అవుతుంటారు. కానీ అందరిలోనూ రాస్ టేలర్ స్టైల్ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది.
భారత్‌తో జరిగిన తొలి వన్డేలో అజేయ శతకంతో రాస్ టేలర్ (109 నాటౌట్) న్యూజిలాండ్ జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌లో విజయాల ఖాతా తెరవలేకపోయిన కివీస్ తొలి వన్డేలోనూ భారత్‌కు షాకిచ్చింది. అయితే తొలి వన్డేలో శతకం సాధించిన తర్వాత రాస్ టేలర్ తన నాలుకను మరోసారి బయటపెట్టి సెంచరీ అభివాదం చేశాడు. కివీస్‌ను గెలిపించిన రాస్ టేలర్‌ను ప్రశంసిస్తూనే నాలుక బయటకు ఎందుకు చాపుతావో చెప్పవా అంటూ భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ ట్విట్టర్ ద్వారా అడిగాడు.
సెంచరీ సాధించిన తర్వాత నాలుక బయటకు ఎందుకు చాపుతాడో రాస్ టేలర్ వెల్లడించాడు. డొమెస్టిక్ క్రికెట్ ఆడే సమయంలో శతకాలు చేసినా కూడా తనను జట్టు నుంచి తప్పించిన సందర్బాలున్నాయని వైడ్ వరల్డ్ ఆఫ్ స్పోర్ట్స్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో టేలర్ తెలిపాడు. తొలి వన్డే తర్వాత మరోసారి రాస్ టేలర్ నాలుక బయటకు తీసి చేసే శతక సెలబ్రేషన్ హాట్ టాపిక్ అవుతోంది. డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ గాల్లోకి ఎగిరి బ్యాట్‌తో పంచ్ విసురుతూ సెంచరీ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఇలా ఒక్కో క్రికెటర్ ఒక్కో తరహాలో సెంచరీ అభివాదాన్ని చేస్తారు. కానీ టేలర్ తరహా స్టైల్ మాత్రం చాలా అరుదు.
‘వన్డేల్లో రెండో సెంచరీని ఆస్ట్రేలియాపై సాధించిన తర్వాత జట్టు నుంచి తప్పించారు. అప్పుడు నేను నా నాలుకను ఇలా బయటపెట్టేశాను. నేను చేసిన పనికి నా కూతురు మెకంజీ సంతోషించింది. దీంతో తనను సంతోషంగా ఉంచడంలో భాగంగా శతకం బాదిన ప్రతి పర్యాయం నేను నాలుకను బయటకు తీసి చూపిస్తూ సెలబ్రేట్ చేసుకుంటాను. నా కుమారుడు జాంటీ సైతం నా సెంచరీ సెలబ్రేషన్ స్టైల్‌ను ఇష్టపడతాడని’ రాస్ టేలర్ వివరించాడు.