కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ హవా కొనసాగుతోంది. నిన్న వెయిట్ లిఫ్టింగ్ క్యాటగరీలో మీరాబాయి చాను స్వర్ణం గెలవగా.. గురురాజ్ రజతం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా అదే విభాగంలో భారత క్రీడాకారిణి సంజిత చాను సత్తా చాటింది. మహిళల 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఆమె రెండవ క్లీన్ అండ్ జర్క్ ప్రయత్నంలో 108 కేజీలు ఎత్తి స్వర్ణం కైవసం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్వర్ణ పతకంతో భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్, పతకాల పట్టికలో 7వ స్థానంలో కొనసాగుతోంది. 6 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలతో ఇంగ్లండ్ మొదటి స్థానంలో ఉండగా, 5 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్యాలతో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో మలేషియా, కెనడా, స్కాట్లాండ్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి.


ఇంకా బ్యాడ్మింటన్, హాకీ, బాక్సింగ్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్స్‌లో భారత క్రీడకారులు పోటీ పడుతున్నారు. ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని కరారే మైదానంలో 21వ కామన్వెల్త్‌ క్రీడలు బుధవారం రంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి.


భారతీయ బ్యాడ్మింటన్‌ దిగ్గజం పీవీ సింధు భారత త్రివర్ణపతాకం ధరించి, ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి నాయకత్వం వహించారు. ఈ కామన్వెల్త్ పోటీలలో భారత్‌ తరఫున మొత్తం 218 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. గత కామన్వెల్త్‌ గేమ్స్‌లో 15 స్వర్ణం, 30 రజతం, 19 కాంస్య పతకాలతో భారత్‌  64 పతకాలు కైవసం చేసుకుంది.