ధోనీపై దినేష్ కార్తిక్‌కి వున్న అభిమానం అద్భుతం !!
2004 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి తెరంగేట్రం చేసిన ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తిక్.
2004 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీతో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి తెరంగేట్రం చేసిన ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తిక్. కానీ ఈ గత పద్నాలుగేళ్లుగా టీమిండియా తరుపున ఆడుతున్నా ఇంతకాలంగా రాని గుర్తింపు, అంతగా లేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఒక్క మ్యాచ్‌తో సొంతం చేసుకున్నాడు దినేష్ కార్తిక్. ఇంకా చెప్పాలంటే, నిదహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఓటమికి ఒకే ఒక్క అడుగు దూరంలో వున్న టీమిండియాను తన అద్భుతమైన ఆటతో విజయతీరాలకు చేర్చి దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రియుల ఆదరాభిమానాలు చూరగొన్న వికెట్ కీపర్. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్‌ని చూసిన వాళ్లంతా ధోనీ తర్వాత మళ్లీ అంతటి ఆటగాడిగా దినేష్ కార్తిక్‌ని అభినందించారు. క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, సీనియర్స్ అయితే, మరో అడుగు ముందుకేసి.. ధోనీ తర్వాత అతడి స్థానంలో టీమిండియాకు మరో ఆటగాడు దొరికాడు అంటూ ప్రశంసలు గుప్పించారు.
నిదహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో గెలుపు తర్వాత క్రికెట్ ప్రియులు తనని టీమిండియా మాజీ కెప్టేన్ ఎం.ఎస్. ధోనీతో పోల్చడంపై దినేష్ కార్తిక్ తనదైన స్టైల్లో స్పందించాడు. " ధోనీ ప్రయాణంతో పోల్చితే నా ప్రయాణం పూర్తి విభిన్నమైంది. అతను చాలా గొప్ప బ్యాట్స్‌మెన్, కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత కూడా యువకులకు మంచి సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్న గొప్ప క్రికెటర్. ఇంకా చెప్పాలంటే, నేను ప్రస్తుతం చదువుకుంటున్న యూనివర్సిటీలో అతను టాపర్ అయితే నేను ఇంకా విద్యార్థి మాత్రమే " అని చెప్పి ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు దినేష్ కార్తిక్. అంతేకాదు.. కొన్ని మ్యాచ్‌ల్లోనైనా అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం నాకు రావడాన్నే ఎంతో సంతోషంగా భావిస్తాను అని దినేష్ కార్తీక్ ఆనందం వ్యక్తంచేశాడు.