ఫిఫా 2018: చిట్టి దేశమైనా.. ఫైనల్‌కు చేరింది
క్రొయేషియా పేరు ఎప్పుడైనా విన్నారా.. జనాభా పరంగా చాలా చాలా చిన్నదేశం ఇది. కేవలం పట్టుమని 70 లక్షలు కూడా ఉండరు క్రొయేషియన్లు.
క్రొయేషియా పేరు ఎప్పుడైనా విన్నారా.. జనాభా పరంగా చాలా చాలా చిన్నదేశం ఇది. కేవలం పట్టుమని 70 లక్షలు కూడా ఉండరు క్రొయేషియన్లు. అయినా ప్రతీ సంవత్సరం ఫిఫాలో ప్రత్యర్థులకు ఏదో మాదిరిగా పోటీని ఇస్తోంది ఈ దేశం. అయినా ఎప్పుడూ దీనిని అదృష్టం వరించలేదు. కానీ ఈ సారి అలా కాదు. రెండో సెమీఫైనల్లో క్రొయేషియా... ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ఫైనల్లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంది.
అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్, రెండో సెమీఫైనల్లో క్రొయేషియా విజయం సాధించి ఇప్పుడు టైటిల్ పోరుకి సిద్ధమవుతున్నాయి. కేవలం 20వ ర్యాంకు ఉన్న జట్టు ఫైనల్‌కు ఎలా చేరిందా అని ఇప్పటికే చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. పెద్దగా అంచనాలు ఏమీ లేని ఈ జట్టు ఫైనల్ చేరుకోవడంతో ఆ దేశానికి ఇప్పటికే ఫ్యాన్స్ కూడా చాలా మంది పుట్టుకొచ్చేశారు.
ఈ పసికూన విజయం సాధించాలని కూడా చాలామంది ఆకాంక్షిస్తున్నారు. ఆ విధంగా యువ టాలెంట్‌ను ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఈ సారి ఎందుకో బ్రెజిల్, స్వీడన్, ఇంగ్లాండ్, స్పెయిన్ లాంటి జట్లు కూడా తమ అభిమానులను బాగా నిరుత్సాహపరిచాయి. ఇటలీ లాంటి ఛాంపియన్ జట్లయితే కనీసం క్వాలిఫై కూడా అవ్వలేదు. 1998లో తొలిసారిగా క్రొయేషియా మూడవ స్థానంతో ఫిఫా వరల్డ్ కప్‌లో సరిపెట్టుకుంది.
ఆ తర్వాత గ్రూప్ స్టేజీల్లోనే బయటకు వచ్చేసింది. కానీ.. ఈసారి అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ఈ పసికూన విజేతగా నిలవడానికి ఓ అడుగు దూరంలో ఉంది. అయితే ఫ్రాన్స్ ముందు ఎలాంటి అనుభవాన్ని ఈ దేశం ప్రదర్శించనుందో వేచి చూడాలంటే ఈ నెల 15వ తేది వరకూ వేచి చూడాల్సిందే.