ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్: భారత్‌లోనూ కొనసాగుతున్న బెట్టింగ్ జోరు
ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫిఫా ఫైనల్స్‌కు ఇంకా రెండు రోజుల సమయమే ఉన్న క్రమంలో భారత్‌లో కూడా బెట్టింగ్ జోరు బాగానే ఊపందుకుంటోంది.
ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫిఫా ఫైనల్స్‌కు ఇంకా రెండు రోజుల సమయమే ఉన్న క్రమంలో భారత్‌లో కూడా బెట్టింగ్ జోరు బాగానే ఊపందుకుంటోంది. అయితే ఇప్పటికే బుకీలపై నిఘాను పోలీసులు పటిష్టం చేయడంతో వారు వేరే దేశాల నుండి ఆపరేషన్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. జీన్యూస్ సమాచారం ప్రకారం ఇప్పటికే నేపాల్, శ్రీలంక దేశాలలోని పలు రహస్య ప్రాంతాల్లో బెట్టింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నారని తెలుస్తోంది.
అలాగే ముంబయి, అహ్మదాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు ఇప్పటికే తమ బెట్టింగ్ స్థావరాలను థాయిలాండ్‌కు తరలించారని కూడా అంటున్నారు. ప్రస్తుతానికి రెగ్యులర్‌గా బెట్టింగ్ చేసే వారికే తొలి అవకాశంగా ఈ ఇతర దేశాల ఆపరేషన్స్ నిర్వహించే వారు సేవలందిస్తున్నారని.. కొత్తగా బెట్టింగ్‌కు దిగేవారైతే కొంత సొమ్ము డిపాజిట్ చేయాల్సి ఉంటుందని కూడా పలు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ముంబయి పోలీసులు ఒక సరికొత్త విధానానికి నాంది పలికారు. సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో సోషల్ మీడియా వేదికలు, వాట్సాప్ లాంటి యాప్స్ పై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ఎవరిమీద ఎలాంటి అనుమానమున్నా.. వెంటనే వారిని ఎంక్వయరీ చేస్తున్నారు. నేడు బెట్టింగ్ కార్యకలాపాలకు ఆన్‌లైన్ వనరులను బుకీలు బాగా ఉపయోగించుకుంటున్న క్రమంలో ఈ వ్యవస్థను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని పోలీస్ శాఖ తెలియజేసింది. ఇప్పటికే పలువురు అనుమానితుల్ని అరెస్టు చేశామని.. ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు తాము తప్పకుండా అడ్డుకట్ట వేస్తామని ముంబయి పోలీస్ అధికారులు తెలిపారు.