భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య లండన్ వేదికగా జరుగుతున్న అయిదవ టెస్టు మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు హనుమ విహారి (56; 124 బంతుల్లో 7×4, 1×6) అర్థ సెంచరీ చేశాడు. ఆయనకు తోడుగా  రవీంద్ర జడేజా (86 నాటౌట్‌; 156 బంతుల్లో 11×4, 1×6) నిలవడంతో వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకి కాస్త గౌరవప్రదమైన స్కోరు దక్కేలా చేసింది. మూడవ రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 174/6తో ఆట మొదలు పెట్టిన భారత జట్టు..  ఆలౌట్ అయ్యే లోపు కనీసం 118 పరుగులైనా జత చేసిందంటే అందుకు ఈ ఇద్దరు క్రీడాకారులే కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చివరి టెస్టులో తొలి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 122 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఆ జట్టులో అలిస్టర్ కుక్ (71 పరుగులు), మోహిన్ అలీ (50 పరుగులు), జాస్ బట్లర్ (89 పరుగులు) బాగా రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చి భారత జట్టులో విరాట్ కోహ్లీ (49 పరుగులు) తర్వాత జడేజా, విహారి మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 95 ఓవర్లలో 292 పరుగులు చేశారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆడడానికి వచ్చిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్లలో జెన్నింగ్స్, మోయిన్ అలీ ఇప్పటికే ఔట్ కాగా.. కుక్, రూట్ క్రీజులో ఉన్నారు. 


వన్‌డౌన్‌లో వచ్చి బాగానే ఆడడానికి ప్రయత్నించిన మొయిన్‌ అలీ (20; 52 బంతుల్లో 3×4) వేగంగానే ఔటయ్యాడు. జడేజా వేసిన 27.4వ బంతికే అతడు క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం 43 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్‌ 114/2 స్కోరుతో ఉంది. ఓపెనర్‌ కుక్‌ (27; 82 బంతుల్లో 3×4), జో రూట్‌ (10; 8 బంతుల్లో 2×4) ఆటను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.