టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ త‌న డిఎస్పీ ర్యాంక్‌ను కోల్పోయారు. ఈ మేర‌కు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హ‌ర్మన్‌ప్రీత్ తప్పుడు డిగ్రీ ధ్రువ పత్రాలను సమర్పించింది. అది విచార‌ణ‌లో న‌కిలీద‌ని తేలింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం హ‌ర్మన్‌ప్రీత్‌ను డిఎస్పీ ర్యాంక్ నుంచి త‌ప్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే ఇదే డిగ్రీ ఆధారంగా గ‌తంలో రైల్వే ఉద్యోగం చేసిన హ‌ర్మన్‌ప్రీత్ ఈ అంశంపై ఇప్పటి వ‌ర‌కు స్పందించ‌లేదు. కేవలం 12వ త‌ర‌గ‌తి మాత్రమే చదివిన ఆమెకు కానిస్టేబుల్ ఉద్యోగం మాత్రమే వ‌స్తుంద‌ని ప్రభుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఫేక్ డిగ్రీ అంశంపై ద‌ర్యాప్తు వివ‌రాల‌ను ఇటీవ‌ల ఆ రాష్ట్ర పోలీసు శాఖ సీఎం కార్యాల‌యానికి అంద‌జేసింది. డీఎస్పీ ఉద్యోగానికి ఆమె అర్హత పొందేందుకు కావాల్సిన అర్హత లేదని, ఈ నేపథ్యంలో ఆమె డీఎస్పీ ఉద్యోగంలో కొనసాగేందుకు వీల్లేదని ముఖ్యమంత్రికి పోలీస్ శాఖ ప్రతిపాదనలు చేసింది. కాగా ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శన చేసినందుకు గానూ పంజాబ్ ప్రభుత్వం ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడం తెలిసిందే!