ఆసియా కప్‌లో భాగంగా దుబయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం హాంగ్ కాంగ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నారు హాంగ్‌కాంగ్ జట్టు కెప్టెన్ అన్షుమన్ రథ్. అయితే పాకిస్తాన్ బౌలర్ల ముందు హాంగ్ కాంగ్ జట్టు పూర్తిగా తేలిపోయింది. వారి అనుభవలేమి కొట్టొచ్చిన్నట్లు కనిపించింది. 37.1 ఓవర్లు మాత్రమే క్రీజ్‌లో ఉన్న హాంగ్ కాంగ్ జట్టు.. కేవలం 116 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాంగ్‌కాంగ్ బ్యాటింగ్‌లో ఐజాజ్ ఖాన్(27), కించిత్ షా(26), నిజాఖత్ ఖాన్ (13), అన్షుమన్ రథ్ (19) మాత్రమే కాస్త రాణించారు. మిగతా క్రీడాకారులందరూ కూడా చాలా తక్కువ స్కోరుకే అవుట్  అవ్వడంతో పాకిస్తాన్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఆ తర్వాత తమ ముందున్న లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే పోగొట్టుకొని.. విజయాన్ని కైవసం చేసుకుంది. తద్వారా ఈ సీజన్ ఆసియా కప్‌లో పాకిస్తాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. 


పాకిస్తాన్ బ్యాట్స్‌మన్లలో ఇమామ్ ఉల్ హక్ (50), బాబర్ ఆజాం (33), ఫకార్ జమాన్ (24) జట్టు విజయానికి తోడ్పడ్డారు. 23.4 ఓవర్లలోనే 120 పరుగులు చేసి తొలి విజయాన్ని నమోదు చేశారు. హాంగ్‌కాంగ్ బౌలింగ్‌లో ఇషాన్ ఖాన్ రెండు వికెట్లు తీశారు. కాగా.. సోమవారం అబుదాబీ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో శ్రీలంక, ఆఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. అదే విధంగా ఈ నెల 18వ తేదిన జరగబోయే మ్యాచ్‌‌లో భారత్, హాంగ్ కాంగ్ తలపడగా.. 19వ తేదిన జరగబోయే మరో మ్యాచ్‌లో భారత తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.