హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేయగా 237 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో పది బంతులు మిగిలివుండగానే 240 పరుగులు చేసి విజయం అందుకుంది. తొలి వన్డేలోనే గెలిచిన భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. కేదార్ జాదవ్ 81, మహేంద్ర సింగ్ ధోని 59, విరాట్ కోహ్లీ 44, రోహిత్ 37 పరుగులు చేసి భారత్‌కు విజయం అందించారు. ఒకానొక దశలో 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది అని అనుకుంటుండగా కేదార్ జాదవ్, ధోనిల 141 పరుగుల భాగస్వామ్యం టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియా బౌలర్లు కౌల్టర్ నైల్, జంపా చెరో 2 వికెట్లు తీసుకున్నారు. 


ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్ ఖవాజా 50, మ్యాక్స్‌వెల్ 40, స్టోయినిస్ 37, కారే 36 పరుగులు చేయగా భారత బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు, కేదార్ జాదవ్ ఒక వికెట్ తీసుకున్నారు.