మూడోసారి.. ఆసియా కప్ కైవసం
బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన ఆసియా కప్ హాకీ లో ఇండియా జట్టు చెలరేగింది. అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఫైనల్లో మలేసియాను 2-1 తేడాతో ఓడించి మూడోసారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. ఆదివారం మలేసియా జట్టుతో హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత జట్టుకు విజయం వరించింది. జట్టులోని రమణ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్ లు చక్కటి ఆట ప్రదర్శన కనపరిచి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించారు. పదేళ్ల విరామం తరువాత భారత్ కు ఈ విజయం దక్కింది. ఆసియా కప్ 2003 (కౌలాలంపూర్), ఆసియా కప్ 2007(చెన్నై)లో భారత్ విజేతగా నిలిచింది.
శనివారం జరిగిన సూపర్-4 పోరులో పాక్ ను 4-0 గోల్స్‌తో ఓడించి భారత్ ఫైనల్లో ప్రవేశించింది. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్లలో భారత్ విజేతగా నిలిచింది. కొరియాతో మాత్రం మ్యాచ్ 1-1తో డ్రా గా ముగిసింది. ఈ టోర్నీలో భారత్ మొదటి స్థానం దక్కించుకోగా, రెండు, మూడు స్థానాలను వరుసగా మలేసియా, పాకిస్థాన్ దక్కించుకున్నాయి. భారత్ ఈ టోర్నీలో విజయం సాధించడంతో ఇండియాలో జరగనున్న 2018 వరల్డ్ కప్ కు క్వాలిఫై అయ్యింది.