డబ్లిన్‌లోని మాలహైడ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో ఇర్లాండ్‌తో జరిగిన తొలి టీ-20లో భారత్ 76 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. భార‌త క్రికెట్ జ‌ట్టు యూకే ప‌ర్యట‌న‌లో భాగంగా ఐర్లండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జ‌రుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం రెండు జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌రిగింది. మ్యాచ్‌లో భాగంగా భార‌త్‌పై టాస్ గెలిచిన ఐర్లాండ్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిర్ణీత 20 ఓవ‌ర్లకు గాను భార‌త్ ఐదు వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగులు చేసింది. భారత జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్ మ(97 పరుగులు: 61 బంతుల్లో 8ఫోర్లు, 5సిక్సర్లు), ధావన్ (74 పరుగులు: 45 బంతుల్లో 5ఫోర్లు, 5ఫోర్లు) చెలరేగి ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సురేశ్ రైనా(10), మహేంద్రసింగ్ ధోనీ(11), హార్దిక్ పాండ్య(6 నాటౌట్), విరాట్ కోహ్లీ(0), మనీశ్ పాండే(0 నాటౌట్) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.  పీటర్ ఛేజ్ ఒక్కడే 4 వికెట్లు తీశాడు. థాంప్సన్, కెవిన్ ఒబ్రైన్ చెరో వికెట్ పడగొట్టారు.


అనంత‌రం 209 ప‌రుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇర్లాండ్ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లకుగాను తొమ్మిది వికెట్లు న‌ష్టానికి 132 ప‌రుగులు చేయ‌గలిగింది. దీంతో 76 ప‌రుగుల తేడాతో ఐర్లాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. కుల్దీప్ 4, చాహల్ 3, బుమ్రా 2 వికెట్ల తీశారు. కాగా భారత్‌కు ఈ మ్యాచ్ వందో అంతర్జాతీయ టీ20 కావడం విశేషం.