కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొంటున్న భారత టీమ్‌కు వార్నింగ్ ఇచ్చింది కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్. గేమ్స్ విలేజ్‌లో ఇండియన్ బాక్సింగ్ టీమ్ ఉంటున్న ప్లేస్‌లో సిరంజీలు కనిపించడం వివాదానికి కారణమైంది. సాధారణంగా గేమ్స్ విలేజ్‌లోకి సిరంజీలను అనుమతించరు. దీంతో ఈ విషయాన్ని ఉల్లంఘన కింద ఫెడరేషన్ పరగణించింది. ఈ మేరకు ఇండియన్ టీమ్‌కు నేతృత్వం వహిస్తున్న అధికారి విక్రమ్ సింగ్ సిసోడియాకు ఫెడరేషన్ ఓ వార్నింగ్ లెటర్‌ను పంపించింది. అటు బాక్సింగ్ టీమ్ డాక్టర్‌గా ఉన్న అమోల్ పాటిల్‌ను హెచ్చరిస్తూ మరో లేఖ రాశారు.


వెంటనే కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ విధివిధానాలు తెలుసుకొని నడుచుకోవాలని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆ లేఖలో హెచ్చరించింది. గత శనివారం గేమ్స్ విలేజ్‌లో సిరంజీలు కనిపించాయని ఫెడరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గ్రీవెమ్‌బర్గ్ తెలిపారు. దీనిని తాము యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేదని, అయితే నో నీడిల్ పాలసీని విస్మరించిందని గ్రీవెమ్‌బర్గ్ చెప్పారు. ఒకవేళ డయాబెటిస్‌ లాంటి వాటికోసం సిరంజీ వాడలనుకుంటే, ముందస్తు అనుమతి తప్పనిసరంది.