మరో సారి రోహిత్ మెరుపులు, బంగ్లా ముందు భారత్ భారీ టార్గెట్ !!
ఓపెనర్ రోహిత్ శర్మ మరో మారు సెంచరీ చేసి టీమిండియాను ఆదుకున్నాడు
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ మరో సారి భారీ స్కోర్ చేసింది. ప్రత్యర్ధి టీం ముందు 315 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కి టీమిండియా 300పైచిలు స్కోరు సాధించడంలో కీలక భూమిక వహించాడు. బంగ్లా బౌలింగ్ విషయానికి వస్తే ముస్తాఫిజుర్ 5 వికెట్లు పడగొట్టి భారత్ మరింత భారీ స్కోర్ చేయకుండా నిలువరించగలిగాడు.
మ్యాచ్ వివరాల్లోకి వెళ్లినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..జట్టు సభ్యులందరూ సమిష్ఠిగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి టీమిండియా 314 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ భారత్ కు ఓపెనింగ్ జోడీ మంచి శుభారంభాన్ని ఇచ్చింది. ఓపెనర్ రోహిత్ 104 పరుగులు చేయగా..మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ 77 పరుగులు చేశాడు. ఫలితంగా తొలి వికెట్ కు ఇరువురు కలిసి 180 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ తర్వాత వచ్చిన కోహ్లీ 26 పరుగులు, రిషబ్ పంత్ 48 పరుగులు, ధోనీ 35 పరుగులు చేసి స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. అయితే దీనేష్ కార్తీక్ 8, హార్ధిక్ పాండ్యా డకౌట్ గా వెనుదిగి కాస్త నిరాశపర్చారు.
భారత్ ఓపెనర్లు భారీ భాగస్వామ్యం నెలకోల్పంతో ఆ దశలో కోహ్లీసేన 350 పరుగులకు పైగా స్కోర్ చేస్తారని భావించారు. అయితే మిగిలిన బ్యాట్స్ మెన్లు అంతంతమాత్రంగా రాణించండంతో పాటు చివర్లో వికెట్లు వెనువెనువెంటనే పడిపోవడం వల్ల ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయారు. ఏది ఎలా ఉన్పప్పటికీ చివరికి బంగ్లాదేశ్ ముందుకు 315 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీసేన ఉంచగల్గింది. సంచలనాలకు మారుపేరైనా బంగ్లా జట్టు భారత్ ఉంచిన ఛాలెంజింగ్ టార్గెట్ ను ఏ మేరకు చేధిస్తుందనేది ఆసక్తికరం మారింది.