ధోనిని విమర్శించిన అభిమానులు; రిప్లై ఇచ్చిన కొహ్లీ
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటపై సర్వత్రా విమర్శలు రావడంతో కెప్టెన్ కోహ్లీ స్పందించారు.
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటపై సర్వత్రా విమర్శలు రావడంతో కెప్టెన్ కోహ్లీ స్పందించారు. ఆ విమర్శలను దురదృష్టకరమని.. అసంబద్ధమని ఖండించాడు.
వివరాల్లోకి వెళితే.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 86 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే..! లార్డ్స్ మైదానంలో 323 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. దీంతో ఈ బాధ్యత ధోనీపై పడింది. ధోని నిదానంగా బ్యాటింగ్ చేయడాన్ని స్టేడియంలోని భారత అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. 46వ ఓవర్‌లో తొలి నాలుగు బంతుల్లో ధోని ఒక్క రన్ కూడా చేయకపోవడంతో కొందరు భారత ఆభిమానులు అతగాడిని వెక్కిరిస్తూ అరిచారు.
ఫ్యాన్స్ ధోనిని అవహేళన చేయడం ఆశ్చర్యం కలిగించిందని ఇంగ్లండ్ ఆటగాడు రూట్ అన్నాడు. మాజీ ఇంగ్లండ్ స్కిప్పర్ నసీర్ హుస్సేన్ ఈ విషయంపై కోహ్లీని ప్రశ్నించగా.. రాణించని ప్రతీసారి ధోనిపై విమర్శలు చేయడం సరికాదని కొహ్లీ అభిప్రాయపడ్డారు. 'ప్రజలు తొందరగా ఒక నిర్ణయానికి వస్తారు. ధోనీ భాగా ఆడినప్పుడు అతన్ని మంచి ఫినిషర్‌గా ఆకాశానికెత్తుతారు. ఒకవేళ విఫలమైతే అతన్ని విమర్శిస్తారు' ఆని అన్నారు. ధోనీ అపార అనుభవమున్న ఆటగాడని.. ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నామని కోహ్లీ పేర్కొన్నాడు.