రేపు గురువారం నుంచి రాజ్ కోట్ వేదికగా వెస్ట్ ఇండీస్‌తో ఆడనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం 12 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. టెస్ట్ మ్యాచ్‌ ఆరంభానికి సమయం దగ్గర పడుతోంటే, ఇంకా జట్టు సభ్యులను ప్రకటించకపోవడం ఏంటని వినిపించిన విమర్శలకు బీసీసీఐ ఈ ప్రకటనతో సమాధానం ఇచ్చింది. ఈ జాబితాలో 18 ఏళ్ల కుర్రాడు పృద్వీ షాకు సైతం చోటు లభించింది. ప్రస్తుతం అండర్ 19 జట్టుకు కెప్టేన్‌‌గా వ్యవహరిస్తున్న పృద్వీ షా ఈ టెస్ట్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్లుగా దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజీలాండ్‌లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో టీమిండియాకు సారధ్యం వహించిన పృద్వీ షాకు ఈ బాధ్యత ఓ కొత్త అనుభవాన్ని తీసుకురానుంది. జట్టులో కొత్త ప్రయోగాలకు చోటు ఎక్కడైనా ఉందా అంటే అది టాప్ ఆర్డర్ మాత్రమేనని విరాట్ కోహ్లీ విశ్వసిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో.. పృద్వీ షా ఈ మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్‌పై తన సత్తా ఏంటో నిరూపించుకోగలిగితే, రానున్న ఆస్ట్రేలియా పర్యటనలో అతడికి మరోసారి చోటు దక్కే అవకాశం కూడా లేకపోలేదని క్రికెట్ క్రీడా నిపుణులు భావిస్తున్నారు.  


ఇక బౌలింగ్ విభాగానికొస్తే, రవిచంద్రన్ అశ్విన్, రవింద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లాంటి స్పెషలిస్ట్ స్పిన్నర్లకు తోడు మొహమ్మద్ షమి, ఉమేష్ యాదవ్ వంటి పేస్ బౌలర్లు వెస్ట్ ఇండీస్‌ను తమ బంతులతో కట్టడీ చేసేందుకు రెడీ అవుతున్నారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కి రానుండగా రవింద్ర జడేజా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.