ఆసియా క్రీడలు-2018 తొలి రోజు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ క్రీడల్లో మొదటి రోజే భారత్‌ విజయంతో స్వాగతం పలికింది. కబడ్డీలో గ్రూప్‌ ఏ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు జపాన్‌ జట్టుపై గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయడం గమనార్హం. ఈ కబడ్డీ పోటీలో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తూ.. వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధిస్తూ.. అత్యున్నత స్థాయి ప్రదర్శనను కనబర్చిన భారత మహిళల జట్టు జపాన్‌ జట్టు పై 43-12 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో జపాన్ జట్టు భారత్‌ జట్టు ముందు ఏ విధంగానూ నిలవలేకపోయింది. ఎంతో అనుభవంతో ఉన్న ఆటగాళ్లు భారత జట్టులో ఉండడం వల్ల... జపాన్ జట్టు అసలు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.  ఇండోనేషియాలోని జకార్తా, పాలెమ్ బ్యాంగ్ ప్రాంతాల్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 18 ఆగస్టు నుండి 2 సెప్టెంబరు వరకూ కొనసాగుతాయి. ఈ సంవత్సరం దాదాపు 570 మంది భారతీయ ఆటగాళ్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. 


ఆసియా క్రీడలకు సంబంధించి కబడ్డీ ఆటలో భారతదేశానికి ప్రత్యేకమైన రికార్డు ఒకటి ఉంది. 1990లో ఆసియా క్రీడల్లో తొలిసారిగా కబడ్డీని ప్రవేశపెట్టగా.. ప్రతీ సంవత్సరం భారత పురుషుల జట్టు బంగారు పతకాన్ని సాధించింది. 2010లో కూడా తొలిసారిగా మహిళల కబడ్డీని ఈ ఆసియా క్రీడల్లో చేర్చగా రెండు సార్లూ భారత జట్టే బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.