అంతర్జాతీయ బాక్సర్‌గా మైక్ టైసన్ సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. అతను ఎన్ని విజయాలు సాధించాడో.. అన్నే వివాదాలు కూడా మూటగట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో ఇదే మైక్ టైసన్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. ఆయన ఒకప్పుడు నివసించిన ఇల్లులో ఓ చర్చిని నిర్మిస్తున్నారట. క్లీవ్ ల్యాండ్ సౌత్ ఈస్ట్ ప్రాంతానికి 45 మైళ్ళ దూరంలో ఉన్న ఆ ఇంటిలోనే తన కెరీర్ ప్రారంభ దశలో మైక్ టైసన్ ప్రాక్టీసు చేసుకొనేవారు. 1979లో నిర్మించిన ఆ ఇంటిని 3 లక్షల డాలర్లకు మైక్ టైసన్ కొనుగోలు చేశారు.


10 సంవత్సరాలు అదే ఇంటిలో నివసించిన ఆయన.. ఓ కేసులో భాగంగా జైలుకెళ్లాక.. దానిని అమ్మేశారు. తర్వాత అదే ఇంటి గురించి చాలా కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. టైసన్ అమ్మేశాక ఆ ఇల్లు చాలామంది చేతులు మారింది. దాని ఆఖరి యజమాని ఆ ఇంటి ప్రాంతాన్ని ఓ క్రిస్టియన్ సంస్థకు చర్చి కట్టడానికి డొనేట్ చేయడంతో ఈ కథకు ఓ ముగింపు దొరికింది. ప్రస్తుతం మైక్ టైసన్ అమెరికాలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన లాస్ వెగాస్‌లో నివసిస్తున్నాడు.