సత్తా చాటిన అంబటి రాయుడు.. బెంగళూరుపై చెన్నై విజయభేరి..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థికి ఆషామాషీ లక్ష్యాన్ని నిర్దేశించలేదు. 206 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకి నిర్దేశించిన బెంగళూరు బౌలర్లకు అంబటి రాయుడు చుక్కలు చూపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయ దుందుభి మ్రోగించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థికి ఆషామాషీ లక్ష్యాన్ని నిర్దేశించలేదు. 206 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టుకి నిర్దేశించిన బెంగళూరు బౌలర్లకు అంబటి రాయుడు చుక్కలు చూపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయ దుందుభి మ్రోగించింది. రాయుడి బ్యాటింగ్‌కి, ఎంఎస్ ధోనీ (70 నాటౌట్; 34 బంతుల్లో 1×4, 7×6) మెరుపు ఇన్నింగ్స్ కూడా తోడవ్వడంతో చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు కింగ్స్‌గానే కాలరెగరేసి మరీ పండగ చేసుకున్నారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు టీమ్‌లో డికాక్ (53), ఏబీ డివిలియర్స్ (68), మన్‌దీప్ సింగ్(32) శ్రమించినా.. ఆ శ్రమకు ఆ తర్వాత అర్థమే లేకుండా పోయింది. మ్యాచ్ 15 ఓవర్ల వరకూ బాగానే కొనసాగినా.. హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందని ప్రేక్షకులు ఆశించినా.. ఆ తర్వాత జట్టు బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చేయడంతో అవే ఆశలు అడియాసలు అయ్యాయి. బెంగళూరు జట్టు ఓటమితోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అంబటి రాయుడి ఇన్నింగ్స్. 40 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో అర్థ సెంచరీ సాధించిన రాయుడు 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉమేశ్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చాడు. కానీ ఆ క్యాచ్‌ను అతను జారవిడుచుకోవడంతో కథే మారిపోయింది. రాయుడు పరుగుల వరదను పారించడంతో బెంగుళూరు బౌలర్లకు దిక్కు తోచలేదు. అయితే అదే రాయుడు 18 ఓవర్‌లో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రేవో 1 సిక్స్, 1 ఫోర్ కొట్టి ధోనికి అండగా నిలవడంతో విజయం చెన్నై జట్టునే వరించింది