జెర్సీ మార్చుకుని కేఎల్ రాహుల్‌ని అభినందించిన హార్థిక్ పాండ్య
క్రీడా స్పూర్తిని చాటుకున్న యంగ్ క్రికెటర్స్
ఐపీఎల్ 2018లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌పై 94 పరుగులు చేసి తిరుగులేని ప్రదర్శన కనబర్చిన కేఎల్ రాహుల్ చివరకు 19వ ఓవర్‌లో ఔట్ అవడంతో అతడి శ్రమ అంతా వృధా అయ్యింది. కేఎల్ రాహుల్ ఔట్ అయిన అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఓటమి పాలైంది. కేవలం మూడు పరుగుల తేడాతో ఓడిపోవడం రాహుల్‌ని తీవ్రంగా బాధించింది. తన శ్రమ అంతా వృథా అయ్యిందే అనే ఆవేదనతో మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ కంటతడి పెట్టుకోవడం గమనించిన ముంబై ఇండియన్స్ క్రికెటర్ హార్థిక్ పాండ్య నేరుగా అతడి వద్దకు వెళ్లాడు. కేఎల్ రాహుల్ ప్రతిభను అభినందిస్తూ.. తాను ధరించిన జెర్సీని తీసి రాహుల్‌కు చేతికి ఇచ్చాడు. అనంతరం రాహుల్ సైతం తన జెర్సీని తీసి పాండ్య చేతికి ఇచ్చాడు. అలా ఒకరి జెర్సీని మరొకరు మార్చుకున్న తీరు చూసి క్రీడాభిమానులు మంత్రముగ్ధులయ్యారు.
సాధారణంగా ఫుట్ బాల్ క్రీడలో మాత్రమే కనిపించే ఈ సంప్రదాయం క్రికెట్‌కి పాకేలా చేశారు ఈ ఇద్దరు యంగ్ క్రికెట్ స్టార్స్. క్రీడాస్పూర్తికి అద్దం పట్టిన ఈ దృశ్యం క్రీడాభిమానుల గుండెలకు హత్తుకుంది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.