ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో విజయాల పట్టికలో అగ్రభాగాన వున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజాగా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌కి చేరుకున్న తొలి జట్టుగానూ నిలిచింది. గురువారం ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై 9 వికెట్ల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ జట్టు ప్లే ఆఫ్‌లో అధికారికంగా బెర్తు ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే తడబడి వరుస వికెట్లు పోగొట్టుకున్న ఈ జట్టును రిషబ్ పంత్ సింగిల్ హ్యాండ్‌తో నడిపించాడు. 128 పరుగులు చేసి (63 బంతుల్లో 15X4, 7 X6) నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్ ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా, ఈ ఏడాది ఐపీఎల్‌లో శతకం కొట్టిన తొలి భారతీయ క్రికెటర్‌గా రికార్డ్ సొంతం చేసుకున్నాడు. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు రిషబ్ పంత్ ఇన్నింగ్స్ కారణంగా 187 పరుగులు చేయగలిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 15 పరుగుల వద్ద అలెక్స్‌ హేల్స్‌(14) వికెట్‌ను కోల్పోయింది. శిఖర్‌ ధావన్‌-కేన్‌ విలియమ‍్సన్‌ జోడి అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించడంతో ధావన్‌ 92 పరుగులు నాటౌట్ (50 బంతుల్లో 9X4, 4X6), విలియమ్సన్‌ 80 పరుగులు నాటౌట్ (53 బంతుల్లో 7 X4, 2x6)ల భాగస్వామ్యం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇద్దరి 173 పరుగుల భాగస్వామ్యంతో 18.5 ఓవర్లలోనే సన్‌రైజర్స్‌ లక్ష్యాన్ని అందుకుని 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై విజయం సాధించింది. 


ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు ఇది మొత్తంగా 9వ విజయం. వరుస విజయాలలో ఇది 6వది. ఇదిలావుంటే ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్లే ఆఫ్‌ బరి నుంచి తప్పుకోక తప్పలేదు.