GT vs KKR Match Abandoned: కీలకమైన దశలో గుజరాత్‌ టైటాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి వరుణుడి రూపంలో ఊహించని పరిణామం ఎదురుకావడంతో ఆ జట్టు అధికారికంగానే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకుని ఇంటి ముఖం పట్టింది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ ఇచ్చారు. మ్యాచ్‌ రద్దుతో కోల్‌కత్తా ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లగా.. గుజరాత్‌ మాత్రం వెనకడుగు వేసి లీగ్‌ నుంచి వైదొలిగింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: IPL RCB vs DC: ఇంకా ప్లేఆఫ్స్ రేసులోనే బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ పని ఖతం


 


అహ్మదాబాద్‌ వేదికగా సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అంతకుముందే 7 గంటలకు టాస్‌ పడాల్సి ఉండగా.. అప్పటికే ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. టాస్‌ వేయడానికి అవకాశమే చిక్కలేదు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో ఐపీఎల్‌ నిర్వాహకులు ఎప్పుడు ఆగుతుందా అని ఎదురుచూశారు. కానీ వారి ఎదురుచూపులు ఫలించలేకపోయాయి. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించాలని ప్రయత్నాలు చేసినా కూడా విఫలమయ్యాయి. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు రాత్రి పది తర్వాత ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ ఇస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

Also Read: IPL CSK vs RR: రాజస్థాన్‌కు భారీ షాక్‌.. చెన్నై అద్భుత విజయంతో ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవం


 


తాజా సీజన్‌లో వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్‌ ఇదే కావడం విశేషం. కొన్ని మ్యాచ్‌లకు వరుణుడు అంతరాయం కలిగించినా తర్వాత తెరపి ఇవ్వడంతో మ్యాచ్‌ను కొనసాగించారు. కానీ గుజరాత్‌, కోల్‌కత్తా మ్యాచ్‌కు మాత్రం వరుణుడు ఎలాంటి విరామం ఇవ్వలేదు. 


గుజరాత్‌కు తీవ్ర నిరాశ
ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ ఏడింట పరాజయం పొందింది. 11 పాయింట్లతోపాటు అతి తక్కువ రన్‌రేట్‌ కలిగి ఉండడంతో గుజరాత్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ సీజన్‌లో గుజరాత్‌కు అన్ని ఆటంకాలే ఎదురయ్యాయి. కెప్టెన్‌ మారడం.. జట్టులో ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేయడం వంటి వాటితో గుజరాత్‌ ప్రదర్శన నామమాత్రంగా ఉంది. సొంత మైదానంలోనూ సత్తా చాటలేకపోయింది. ప్లేఆఫ్స్ చేరుకోవాల్సిన సమయంలో తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం గుజరాత్‌ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇక కప్‌ సంగతి దేవుడెరుగు ప్లేఆఫ్స్‌కే చేరుకోకపోవడం గుజరాత్‌కు ఘోర పరాభవంగా చెప్పవచ్చు.


కోల్‌కత్తా దూకుడు
ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన మొదటి జట్టుగా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ నిలుస్తోంది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు కోల్పోయి తొమ్మిదింట నెగ్గిన కోల్‌కత్తా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఆ స్థానాన్ని ఇతర జట్లు చేరలేకపోతున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్‌లోకి అధికారికంగా వెళ్లిన కేకేఆర్‌కు గుజరాత్‌ మ్యాచ్‌ రద్దవడం మేలే చేసింది. ఒకవేళ మ్యాచ్‌ జరిగి ఓడినా నష్టం లేదు. వర్షం కారణంగా రద్దవడంతో ఒక పాయింట్‌ను ఖాతాలో వేసుకున్న కోల్‌కత్తా 19 పాయింట్లతో శిఖరాగ్ర స్థానంలో ఉంది. ఈసారి ట్రోఫీ కోల్‌కత్తాదే అనే చర్చ జరుగుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter