ఐపీఎల్‌ 2018లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ ప్రత్యర్థికి 170 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తొలుత టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టు బౌలింగ్‌కే మొగ్గు చూపడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫస్ట్ బ్యాటింగ్‌కి దిగింది. కోల్‌కతా బ్యాటింగ్ విభాగంలో టాప్ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. తొలి 8 ఓవర్లలోనే నలుగురు బ్యాట్స్ మెన్ పెద్దగా పరుగులు రాబట్టకుండానే వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు కెప్టేన్ దినేశ్‌ కార్తీక్, ఆండ్రూ రస్సెల్‌, శుబ్‌మన్‌గిల్‌లు రాణించడంతో 169 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌‌ని చేయగలిగింది. 


కెప్టేన్ దినేశ్ కార్తీక్‌ 38 బంతుల్లో (4X4, 2X6) 52 పరుగులు రాబట్టగా చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన ఆండ్రు రస్సెల్‌  సైతం తనదైన స్టైల్లో 25 బంతుల్లో 49 పరుగులు (3X4, 5X6) రాబట్టి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేయగలిగింది. ఇక కోల్‌కతాపై 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధిస్తుందో లేదో వేచిచూడాల్సిందే మరి.