IPL RCB vs MI: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా బెంగళూరు-ముంబై జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య కుమార్ యాదవ్ 37 బంతుల్లో 6 సిక్స్‌లు 5 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. 79 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబై 120 స్కోరైనా చేయగలుగుతుందా అన్న సందేహాలు కలిగాయి. సూర్య కుమార్ యాదవ్ చెలరేగి ఆడటంతో ముంబై గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ముంబై బ్యాట్స్‌మెన్‌లో సూర్య కుమార్ యాదవ్ టాప్ స్కోరర్‌ నిలవగా.. మరే బ్యాట్స్‌మెన్ అంతగా రాణించలేదు.


ఇషాన్ కిషన్ 26 (28), కెప్టెన్ రోహిత్ శర్మ 26 (15) పరుగులకే ఔట్ అవగా బ్రేవిస్, రమణదీప్ సింగ్ సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. తిలక్ వర్మ, పొలార్డ్ ఇద్దరూ డకౌట్స్‌గా వెనుదిరిగారు. బెంగళూరు బౌలర్లలో హసరంగ, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశారు.


ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ జట్టు ఓటమిని చవిచూసింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ బోణీ చేయని ఆ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గుతుందేమోనని ముంబై ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే 151 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబై కాపాడుకోగలదా లేదా చూడాలి. మరోవైపు, బెంగళూరు జట్టు ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ముంబై విసిరిన టార్గెట్‌కి బెంగళూరు ఎలా బదులిస్తుందో చూడాలి.