ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన డే/నైట్ టెస్టు మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ తన టెస్టు కెరీర్లోనే 18వ సెంచరీ సాధించి.. న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కారు. ఆయన తర్వాతి స్థానాల్లో మాజీ క్రికెటర్ మార్టిన్ క్రో, ప్రస్తుతం ఆడుతున్న రాస్ టేలర్ చెరొక 17 సెంచరీలు చేసి ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నారు.


తన టెస్టు కెరీర్‌లో విలయమ్సన్ పేరిట ఈ 18 సెంచరీలతో పాటు మరో 26 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక వన్డేల విషయానికి వస్తే ఇదే బ్యాట్స్‌మన్ 11 సెంచరీలు, 33 అర్థ సెంచరీలు చేశారు. ఇక టీ20 మ్యాచ్‌ల్లో 8 అర్థ సెంచరీలు చేశారు. విలియమ్సన్ గతంలో ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఆడారు. అలాగే యార్క్ షైర్, బార్బడోస్ ట్రైడెంట్స్ జట్ల తరఫున కూడా ఆడారు.