ఐపీఎల్ 2018 : రాజస్తాన్ నిష్క్రమణ, తర్వాతి పోరులో హైదరాబాద్ vs కోల్‌కతా
ఐపీఎల్ నుంచి తప్పుకున్న రాజస్తాన్
ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌కి అర్హత సాధించగా ఓడిపోయిన రాజస్తాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ 2018 నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. కోల్‌కతా బ్యాటింగ్ విభాగంలో టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైనప్పటికీ ఆ జట్టు కెప్టేన్ దినేశ్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్, శుబ్‌మన్‌గిల్‌లు రాణించడంతో 169 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ని చేయగలిగింది. కెప్టేన్ దినేశ్ కార్తీక్ 38 బంతుల్లో (4X4, 2X6) 52 పరుగులతో రాణించగా చివర్లో బ్యాటింగ్‌కి వచ్చిన ఆండ్రు రస్సెల్ సైతం తనదైన స్టైల్లో 25 బంతుల్లో 49 పరుగులు (3X4, 5X6) రాబట్టి నాటౌట్‌గా నిలిచాడు.
అనంతరం కోల్‌కతాపై 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు తొలుత నిలకడగానే బ్యాటింగ్ చేసింది. అజింక్య రహానే (46), రాహుల్ త్రిపాఠి (20), సంజు శాంసన్ (50) క్రీజులో వున్నంతసేపు నిలకడగానే కనిపించిన ఆట ఎప్పుడైతే పీయుష్ చావ్లా (2/24) శాంసన్, త్రిపాఠిల వికెట్స్ తీసుకున్నాడో అప్పుడే కోల్‌కతా చేతుల్లోకి వెళ్లిపోయింది. అనంతరం కోల్‌కతా బౌలర్లు విసిరిన బంతుల తాకిడికి ఒత్తిడికి గురైన రాజస్తాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యారు. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైన రాజస్తాన్ రాయల్స్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకుంది.
రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఈ నెల 25న రెండవ క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.