రికార్డులను తిరగరాయలంటే అది కోహ్లీ తర్వాతే ఎవరైనా..! తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో కోహ్లీ భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ రికార్డును సమం చేసి వార్తల్లో నిలిచాడు. గంగూలీ పేరిట ఉన్న విదేశాలలో 11 శతకాల రికార్డును సమం చేసి.. అంతే మొత్తం శతకాలు సాధించిన మరో భారత జట్టు కెప్టెన్‌గా వార్తల్లోకి ఎక్కాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 112 పరుగులు చేసి ఈ రికార్డును పొందాడు. అది కోహ్లీ 33వ శతకం కూడా కావడం గమనార్హం. అలాగే భారత క్రికెట్ రథసారథిగా పగ్గాలు చేపట్టాక అది కోహ్లీ సాధించిన 11వ శతకంగా నమోదైంది. అయితే ఒక్క సారి ఇదే రికార్డును గంగూలీ రికార్డుతో పోల్చి చూసుకుంటే.. కోహ్లీ కేవలం 41 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు సాధించాడు. కాగా గంగూలీ 142 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. 


ఇదే రికార్డుతో పాటు మరో రికార్డు కూడా కోహ్లీ నమోదు చేశాడు. తాను ఆడిన అన్ని దేశాలపై కూడా సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. డర్బన్‌లో గురువారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆరు వన్డేల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలో నిలుస్తోంది. ఇంకో చిత్రమేంటంటే.. మ‌రొక్క సెంచ‌రీ సాధిస్తే విదేశాల్లో అధిక సెంచ‌రీలు చేసిన భార‌త కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డ్స్ బుక్‌లో చోటు సంపాదిస్తాడు.