ఆసియా బ్యాడ్మింటన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌‌లో దుమ్ము రేపిన 16 ఏళ్ల కుర్రాడు లక్ష్యసేన్‌కు ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ 10 లక్షల రూపాయలను పారితోషికంగా ప్రకటించింది. భారత్ తరఫున ఈ ఛాంపియన్ షిప్ సాధించిన మూడవ వ్యక్తిగా ఇప్పటికే లక్ష్య సేన్ రికార్డులకెక్కాడు. ఈ ఉత్తరాఖండ్ క్రీడా దిగ్గజం ప్రపంచ నంబర్‌ వన్‌ షట్లర్ మరియు థాయిలాండ్ క్రీడాకారుడు  విదిత్‌ శరణ్‌ను 21-19, 21-18 తేడాతో వరుసగా జరిగిన పోటీల్లో మట్టికరిపించి ఈ ఘనతను సాధించాడు. గత సంవత్సరం లక్ష్యసేన్‌ ఇదే టోర్నీలో కాంస్య పతకం సాధించాడు. ఒక రకంగా చరిత్ర తిరగరాసిన లక్ష్యసేన్‌‌ పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెమీఫైనల్లో ఇండోనేషియా షట్లర్‌ ఇమ్మాన్యూయెల్‌పై 21-7, 21-14తో వరుస గేముల్లో గెలుపొందిన లక్ష్యసేన్‌ ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. తన సత్తా చూపించడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలో గౌతమ్‌ ఠక్కర్‌ (దివంగత) 1965లో బంగారు పతకం గెలిచిన తర్వాత మరో భారతీయుడు స్వర్ణ పతకం గెలవడం ఇదే తొలిసారి కావడంతో ఇప్పుడు భారత్ శిబిరంలో ఆనందం వెల్లువలా కురుస్తోంది. ఇది 53 ఏళ్ల కల అని ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలిపింది.