వరల్డ్ రికార్డ్‌ను సృష్టించిన లియాండర్ పేస్
డేవిస్ కప్ చరిత్రలో అత్యధిక డబుల్స్ విజయాలు అందుకొని లియాండర్ పేస్ ప్రపంచ రికార్డును సృష్టించాడు
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ డేవిస్ కప్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. డేవిప్ కప్‌లో 43 సార్లు డబుల్స్ టైటిల్స్ గెలిచి అత్యంత సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా నిలిచాడు. లియాండర్ పేస్ కంటే ముందు ఇరాన్‌కు చెందిన నికోలా పిట్రాంగిలీ డేవిస్ కప్ డబుల్స్‌లో 42 విజయాలు అందుకున్నాడు.
డేవిస్‌కప్‌లో అత్యధిక డబుల్స్ విజయాలతో పేస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. శనివారం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో చైనా జంటపై 5-7, 7-6, 7-6తో పేస్-బోపన్న జోడీ గెలుపొందింది. అయితే టోర్నీలో భారత్ 1-2 పాయింట్ల తేడాతో చైనా కంటే వెనకే ఉంది. ఈ టోర్నీలో రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
లియాండర్ పేస్ తన తొలి డేవిస్ కప్ విజయాన్ని 1990లో నమోదు చేశాడు. 16 సంవత్సరాల వయసులో, జీషన్ అలీ భాగస్వామిగా 5 సెట్ల క్లిష్టమైన పోటీలో జపాన్ జట్టుని ఓడించడంతో ప్రారంభించాడు. 1991–1998 మధ్య కాలంలో ప్రపంచ సమూహంలో చేరిన భారత డేవిస్ కప్ జట్టులో అతను ప్రముఖ పాత్ర పోషించాడు. స్విట్జర్లాండ్ మరియు ఫ్రాన్స్‌లను ఓడించి 1993 డేవిస్ కప్ సెమీ-ఫైనల్స్ కు చేరి, చివరికి ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయిన భారత డేవిస్ కప్ జట్టులో భాగంగా ఉన్నాడు. 1993లో ఫ్రాన్స్‌లోని ఫ్రేజస్‌లో ఫ్రెంచ్ ద్వయం అర్నుద్ బోఎస్చ్ మరియు హెన్రి లెకొంటేలపై, 1994లో వినే ఫెరీరాపై మరియు 1995లో భారత్ క్రొవేషియాను ఓడించినపుడు గొరాన్ ఇవానిసెవిక్ పై, 1995లో నెదర్లాండ్స్‌కు చెందిన జాన్ సిమేరింక్ పై, 1997లో జిరి నోవాక్ పై విజయాలు ఇతని సింగిల్స్ విజయాలలో ప్రధానమైనవి.
1996-1997లో లియాండర్ భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని, 1990లో అర్జున అవార్డుని గెలుచుకున్నాడు. భారతదేశంలో టెన్నిస్ రంగానికి గాను అతను చేసిన అసాధారణ సేవలకు గాను 2001లో పద్మ శ్రీని పొందాడు.