చెన్నైలోని జవహర్ లాల్ ఇండోర్ స్టేడియంలో చెన్నైయన్ ఎఫ్సీ మరియు నార్త్ ఈస్ట్ యూనైటైడ్ ఎఫ్సీ జట్ల మధ్య జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్‌ సందర్భంగా ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. మ్యాచ్‌లో ఓడిపోయిన నార్త్ ఈస్ట్ జట్టుకి సంబంధించిన మహిళా అభిమానులను కొందరు చెన్నై టీమ్ అభిమానులు తొలుత గేలి చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత వారి చర్యలు శ్రుతి మించాయి. ఆ యువతుల చుట్టూ చేరి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. డ్యాన్స్ కూడా చేయడం ప్రారంభించారు. వారిని కొందరు నెట్టివేయడానికి ప్రయత్నించినా.. వారు అక్కడి నుండి వెళ్లిపోలేదు. నార్త్ ఈస్ట్ అమ్మాయిలను ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. వారిని తాకడానికి కూడా ప్రయత్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ ఘటన జరిగిన వెంటనే చెన్నైయన్ ఎఫ్‌సీ మేనేజ్‌మెంట్ ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించింది. "ఇలాంటి విషయాల్లో మేము చాలా కఠినంగా ఉంటాం. జాత్యహంకార చర్యలను మేము ఎప్పుడూ సమర్థించం. ఆ చర్యలకు పాల్పడిని వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటాం" అని ప్రకటించింది.


 



 


ఇదే ఘటనపై నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్టు యజమాని మరియు సినీ నటుడు జాన్ అబ్రహామ్ స్పందించారు. "క్రీడలు ఇతరులకు హాని కలిగించేలా మారుతుండడం చాలా బాధాకరం. గెలుపోటములు సహజం. అయితే ఒకరు ఓడిపోయినంత మాత్రాన వారిని తక్కువగా చూడడం, వేధించడం సమర్థనీయం కాదు. ఆ అమ్మాయిలను వేధించిన వారిని నేను అభిమానులుగా భావించను. వారు ఫేక్ ఫ్యాన్స్ అని నా అభిప్రాయం. చెన్నైయన్ ఎఫ్సీ యజమాని అభిషేక్ బచ్చన్ గానీ, నేను గానీ ఇలాంటి వాటిని ఎప్పుడూ ప్రోత్సహించేది లేదు. నేను తప్పనిసరిగా ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెతికిపట్టుకొని, క్షమాపణ చెప్పిస్తాను" అని తెలిపారు. అలాగే నార్త్ ఈస్ట్ యూనైటెడ్ ఎఫ్సీ జట్టు కూడా ట్విటర్‌లో ఒక ప్రకటన జారీ చేసింది. వేధింపులకు గురైన అమ్మాయిలకు అండగా నిలుస్తానని ప్రకటించింది.